హువావేకు షాక్‌ : కీలక అధికారి అరెస్టు

6 Dec, 2018 10:13 IST|Sakshi

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువావే టెక్నాలజీస్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)ను కెనడా అధికారులు అరెస్ట్‌ చేశారు.  అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్‌ అధికారులు హువావే డిప్యూటీ చైర్మన్‌ను అరెస్ట్‌ చేసిందన్న షాకింగ్‌ న్యూస్‌  పరిశ్రమ వర్గాలను విస్మయ పర్చింది. అంతేకాదు సీఎఫ్‌వోను త్వరగా అమెరికాకు రప్పించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధించే వాణిజ్యపరమైన నిబంధలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ అరెస్టు చోటు చేసుకుంది.

హువావే బోర్డు డిప్యూటీ చైర్, కంపెనీ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫే కుమార్తె మెంగ్‌ వాంగ్‌జోను వాంకోవర్‌లో డిసెంబరు1, శనివారం అరెస్టు చేశామని అధికారులు బుధవారం ప్రకటించారు. ఆమె బెయిల్‌ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరగనుందని న్యాయశాఖ ప్రతినిధి ఇయాన్ మెక్లాయిడ్ వెల్లడించారు. ఇంతకుమించి తాము ఎటువంటి వివరాలను అందించలేమని పేర్కొన్నారు. 

మరోవైపు ఈ  పరిణామాన్ని  హువావే, చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.  ఇది మానవహక్కులకు తీవ్ర హానికరమైన చర్య అని పేర్కొంది. మెంగ్ ఎలాంటి  నిబంధనలను ఉల్లంఘించలేదని, తక్షణమే ఆమెను విడుదల చేయాలని ఒట్టావాలోని చైనీస్ రాయబార కార్యాలయం డిమాండ్‌ చేసింది. తాము  చట్టపరమైన అన్ని నిబంధనలను విధిగా పాటిస్తున్నామని హువావే ప్రకటించింది.  ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఇది అమెరికా చైనా మధ్య నెలకొన్న ట్రేడ్‌వార్‌కు సంబంధించి తీవ్రమైన పరిణామంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌  వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు