నిజమైన నాయకుడు పుట్టిన వేళ..

24 Oct, 2015 18:03 IST|Sakshi
నిజమైన నాయకుడు పుట్టిన వేళ..

ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచమంతా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వైపు చూస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో దిగజారిపోతున్న కెనడా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దుతారన్నదే అందరి ఆసక్తి. చమురు ధరలు పడిపోవడానికి, దినుసుల ధరలు పెరగడానికి సంబంధం ఏమిటి? ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం రోజురోజుకు ఎందుకు పెరుగుతోంది, వినియోగదారుల్లో ఎక్కువ శాతం ఉండే మధ్యతరగతి ప్రజలను గత ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తూ వచ్చాయి? ఇవన్నీ ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి ముందు జస్టిన్‌ను తొలచిన ప్రశ్నలు. వ్యవస్థలోనే ఏదో లోపం ఉందని గ్రహించడానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు.

మాజీ ప్రధానమంత్రి పియెర్రా ట్రూడో వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా, 2008లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనా రాజకీయాలను మరీ సీరియస్‌గా తీసుకోలేదు. రాజకీయాల కన్నా కుటుంబం ముఖ్యమనుకున్నారు. భార్య సోఫీతో పాటు ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. వారికి బంగారు భవిష్యత్తును కల్పించే సామాజిక పరిస్థితులు దేశంలో ఉన్నప్పుడే వారి భవిష్యత్తు కూడా బాగుంటుందని భావించారు. అలా జరగాలంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దేశ వ్యవస్థ మారాలని అనుకున్నారు. అందుకు తానే శ్రీకారం చుట్టాలనుకున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా 2013లో లిబరల్ పార్టీ పగ్గాలు స్వీకరించారు.

రాజకీయాల్లోకి రాక ముందు నుంచి క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ను అమితంగా అభిమానించే జస్టిన్ వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనల ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించేవారు. గంజాయిని చట్టబద్ధం చేయాలని వాదించడమే కాకుండా 2010లో తాను స్వయంగా గంజాయితో నింపిన హుక్కాను తాగానని బహిరంగంగా ప్రకటించారు.
దేశంలోని మహిళలకు అబార్షన్ హక్కు ఉండాలని డిమాండ్ చేయడమే కాకుండా, ఆడవాళ్లు కోరుకుంటే బురఖాలు ధరించే హక్కు కూడా వారికుందని వాదించారు. పైగా తాను మహిళా పక్షపాతినని చెప్పుకున్నారు. అబార్షన్ హక్కుకు ఓటేయని వారికి పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా లేదని వాదించారు. ఈ హక్కుతో విభేదించిన పార్టీ సభ్యులకు 2015 ఎన్నికల్లో టిక్కెట్లు కూడా నిరాకరించారు.

ఎప్పడూ నీట్‌గా షేవ్ చేసుకొని నిండైన విగ్రహంలా కనిపించే జస్టిన్ స్ఫురద్రూపి. ఎడమ భుజంపై హైదా జాతి జనులున్న (కెనడా ప్రజల మూల జాతి) భూగోళం చిత్రాన్ని చెక్కిన టాటూ ఉంటుంది. రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించిన జస్టిన్‌కు నాటకాల్లో మంచి నటుడిగా, రచయితగా కూడా మంచి పేరుంది.

2015 ఎన్నికల్లో ఓడిపోతారన్న ఎన్నికల విశ్లేషకులు అంచనాలను ఊహించని విధంగా తారుమారు చేశారు. దానికి కారణంగా ఓ వీధిలోని కిరాణా షాపు నుంచి తాను ప్రారంభించిన ప్రచారయాత్రే కారణమని ప్రధాని బాధ్యతలు స్వీకరించాక తెలిపారు. దినసరి సరుకులు కొనేందుకు వచ్చే ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి వారిని ప్రత్యక్షంగా కలుసుకొని వారి కష్టసుఖాలు విచారించేవాడినని, ఆ తర్వాత మెట్రో రైల్వేస్టేషన్ల వద్దకు వెళ్లి వచ్చిపోయే ప్రయాణికుల జీవితానుభవాలను విచారించేవాడినని చెప్పారు. వారి జీవితానుభవాలను ఆకళింపు చేసుకోవడం వల్లనే ఆర్థిక వ్యవస్థను ఎలా సరిదిద్దవచ్చో,  ప్రజాస్వామ్యం బలపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తనకు అవగతమైందని అన్నారు.

దేశ పురోగతిలో మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించాలని, ధనికులకు రాయతీలు వదిలేసి మధ్య తరగతికి రాయితీలు కల్పించడం మంచిదన్నది, స్థూలంగా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక రంగంలో సమాన అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని చెప్పారు. కెనడా ప్రజలు కలలు కంటారని, వారు సృజనశీలురని, బిల్డర్లని, అందరి కలలను నెరవేర్చేందుకే తాను ప్రధాన మంత్రినయ్యానని ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

-వి.నరేందర్ రెడ్డి

మరిన్ని వార్తలు