టీచ‌ర్‌గా మారిన కెన‌డా ప్ర‌ధాని

11 May, 2020 18:56 IST|Sakshi

ఒట్టావా: కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో జీవితంలో ఎన్నో ఎత్తుప‌ళ్లాల‌ను చూశారు. చిన్న‌చిన్న ఉద్యోగాల నుంచి మొద‌లుకుని ఉపాధ్యాయుడిగానూ విధులు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానిగా దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఇదిలా వుండ‌గా ఇప్పుడు ప్ర‌పంచాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో విద్యార్థులు స్కూళ్ల‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంట్లో నుంచే హోమ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స‌మ‌యంలో పిల్ల‌ల‌కు త‌న అవ‌స‌రం ఆవ‌శ్య‌క‌మ‌ని భావించిన ప్ర‌ధాని ట్రూడో మ‌రోసారి ఉపాధ్యాయుడిగా మారేందుకు సిద్ధ‌మ‌య్యారు. (కరోనా నుంచి కోలుకున్న కెనడా ప్రధాని భార్య)

పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల‌కు హోమ్‌వ‌ర్క్‌లో ఏవైనా అర్థం కాక ఇబ్బంది ప‌డితే నిర‌భ్యంత‌రంగా అడ‌గ‌వ‌చ్చ‌ని, సాయం చేసేందుకు తానెప్పుడూ అందుబాటులో ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో వీడియో సందేశం అందించారు. మ‌నమంతా క‌లిసి ముందుకు సాగ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. కాగా జ‌స్టిన్ ట్రూడో బ్రిటీష్ కొలంబియాలోని వాంకోవ‌ర్ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌ని చేశారు. ఆ స‌మ‌యంలో గ‌ణితం, ఫ్రెంచ్‌తో పాటు మాన‌వ‌త్వ విలువ‌లను కూడా పిల్ల‌ల‌కు బోధించేవారు. ఇదిలా వుండ‌గా కరోనా‌ బారిన పడిన ప్ర‌ధాన‌మంత్రి జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి  ఈ మ‌ధ్యే కోలుకున్న విష‌యం తెలిసిందే. (అక్క‌డ బుల్లెట్ త‌గిలినా బ‌తికేసింది)

మరిన్ని వార్తలు