వేగంగా కెనడా విద్యార్థి వీసా

26 Jun, 2018 02:40 IST|Sakshi

కొత్త విధానం ప్రవేశపెట్టిన అక్కడి ప్రభుత్వం

టొరంటో: కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై వీసాలు  మరింత వేగంగా లభించనున్నాయి. భారత్‌తోపాటు చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీ విధానంలో కెనడా తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఈ ప్రయోజనం కలగనుంది. ఈ నాలుగు దేశాల విద్యార్థుల కోసం స్టూడెంట్‌ డైరెక్ట్‌ స్ట్రీమ్‌ (ఎస్‌డీఎస్‌) పేరుతో కెనడా ఓ కొత్త వీసా పథకాన్ని ప్రారంభించింది.

ఆ దేశంలో చదివేందుకు అవసమైన భాషా పరిజ్ఞానం, ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులు ఎస్‌డీఎస్‌ కింద దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లోపే వీసా జారీ ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణ విధానంలో అయితే ప్రస్తుతం కెనడా విద్యార్థి వీసా పొందడానికి రెండు నెలల సమయం పడుతోంది. అయితే ఎస్‌డీఎస్‌ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సాధారణం కన్నా కఠినమైన భాషా పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్, చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం విద్యార్థులకు ఇంచుమించు ఎస్‌డీఎస్‌ లాంటి విధానాన్నే అమలుచేస్తున్నప్పటికీ, ఈ నాలుగు దేశాలకు ఉమ్మడిగా తాజాగా కొత్త పద్ధతిని తెచ్చినట్లు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల విభాగం వెల్లడించింది.

మరిన్ని వార్తలు