చైనా తాకట్టు దౌత్య విధానాలు అనుసరిస్తోంది: ట్రూడో

9 Jul, 2020 14:39 IST|Sakshi

ఒట్టావా: పరస్పర ప్రతివిమర్శలతో కెనడా, చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో హంకాంగ్‌పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా కెనడా ‘అప్పగింత ఒప్పందాన్ని’ రద్దు చేసింది. అలాగే  మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం-రెండు విధానాలు’ అన్న పద్దతిని తాము పాటిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హంకాంగ్‌కు మిలిటరీ వస్తువుల ఎగుమతిని రద్దు చేస్తూ.. కెనడా నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మిలిటరీ వస్తువులు చైనా ప్రధాన భూభాగం కోసం వినియోగించబడుతున్నట్లు కెనడా అనుమానిస్తోంది. అందువల్లే మా విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత అంశంలో ఇది ఎంతో ముఖ్యమైన నిర్ణయం’ అన్నారు ట్రూడో. అయితే ‘అప్పగింత ఒప్పందాన్ని’ రద్దు చేయడంపై హాంకాంగ్‌ అధికారులు నిరాశ వ్యక్తం చేశారు. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా')

కెనడా, చైనా మధ్య సంబంధాల విషయంలో గత కొంతకాలంగా ఉద్రిక్తలు నెలకొన్నాయి. చైనీస్‌ టెలికాం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫే కుమార్తె, సంస్థ సీఎఫ్‌ఓ మెంగ్‌ వాంఝూను ఓ కేసులో అనుమానితురాలిగా పేర్కొంటూ అమెరికా ఆమెపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో వావే అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ దేశానికి సహకరిస్తోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో కెనడాలో తలదాచుకున్న మెంగ్‌​ వాంఝాని అమెరికా అభ్యర్థనపై కెనడా పోలీసులు 2018 డిసెంబరులో అరెస్టు చేశారు. అదే సమయంలో గూఢచర్యం ఆరోపణలపై కెనాడకు చెందిన మైఖేల్ కోవ్రీ, మాజీ దౌత్యవేత్త, వ్యాపారవేత్త మైఖేల్ స్పావర్లను చైనా అరెస్టు చేసింది. వారికి కనీసం దౌత్యపరమైన సాయం పొందేందుకు కూడా చైనా అనుమతించడం లేదు. ఫలితంగా ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ప్రకటన చేశారు. (ఆమెను విడుదల చేయండి : చైనా వార్నింగ్‌!)

అయితే మెంగ్‌ వాంఝాని విడిచిపెడితే.. కెనడా పౌరులను విడదుల చేస్తానని చైనా వెల్లడించింది. ఈ అంశంలో ప్రధాని మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. కానీ ట్రూడో మాత్రం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. చైనా షరతుకు అంగీకరించి.. మెంగ్‌ వాంఝాను విడిచిపెడితే.. ఇక భవిష్యత్తులో ఏ కెనడా పౌరుడికి కూడా రక్షణ కల్పించలేమని ఆయన అన్నారు. ఇప్పుడు చైనా షరతుకు తలవంచితే.. రానున్న రోజుల్లో కూడా అది ఇలానే ప్రవర్తిస్తుందని ట్రూడో అభిప్రాయపడుతున్నారు. చైనా ఖైదీల విడుదల ప్రక్రియ ఆ దేశ తాకట్టు దౌత్యవిధానాలకు అద్దం పడుతుందని ట్రూడో విమర్శించారు.

మరిన్ని వార్తలు