సౌదీ యువతికి కెనడా ఆశ్రయం

13 Jan, 2019 04:29 IST|Sakshi
సౌదీ అరేబియా యువతి రహాఫ్‌ ముహమ్మద్‌ అల్‌ఖునన్‌

టొరంటో/బ్యాంకాక్‌: థాయిలాండ్‌లో చిక్కుకుపోయిన సౌదీఅరేబియా యువతి రహాఫ్‌ ముహమ్మద్‌ అల్‌ఖునన్‌(18) శనివారం ఎట్టకేలకు కెనడాకు చేరుకుంది. ఇంట్లో వేధింపులు తట్టుకోలేక థాయ్‌లాండ్‌కు పారిపోయివచ్చిన రహాఫ్‌కు ఆశ్రయమిస్తామని కెనడా ప్రధాని  ట్రూడో ప్రకటించడం తెల్సిందే. ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ చొరవతోనే ఇది సాకారమైందని థాయ్‌లాండ్‌ ఇమ్మిగ్రేషన్‌ ముఖ్య అధికారి సురాచత్‌ హక్‌పర్న్‌ తెలిపారు. సౌదీకి చెందిన రహాఫ్‌ మహ్మద్‌ అల్‌ఖునన్‌ తల్లిదండ్రుల ఆంక్షలను తట్టుకోలేక, తనకు నచ్చినట్టుగా బతికేందుకు కువైట్‌ నుంచి థాయ్‌లాండ్‌ మీదుగా ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు యత్నించారు. అయితే తగిన పత్రాలు లేకపోవడంతో రహాఫ్‌ను జనవరి 5న థాయ్‌లాండ్‌ అధికారులు ఎయిర్‌పోర్టులోనే ఆపేశారు.

దీంతో బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌ హోటల్‌ గదిలో దాక్కుని తన పరిస్థితిని సోషల్‌మీడియా ద్వారా ఐరాస, మీడియా దృష్టికి తీసుకెళ్లారు. రహాఫ్‌కు ఆశ్రయం కల్పించే విషయమై ఆస్ట్రేలియా, కెనడా సహా పలు దేశాలతో ఐరాస చర్చించింది. అయితే వేగంగా స్పందించిన కెనడా తాము రహాఫ్‌కు ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించగా, అందుకు ఆమె అంగీకరించారు.  కాగా, ఈ విషయంలో తనకు సాయం చేసిన ప్రతీఒక్కరికి రహాఫ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కెనడా ప్రభుత్వ తాజా నిర్ణయంతో సౌదీతో ఆ దేశ సంబంధాలు మరింత దిగజారనున్నాయి. ఇంతకుముందు సౌదీలో మహిళా హక్కుల కార్యకర్తలకు మద్దతు పలకడంతో కెనడాపై సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

మరిన్ని వార్తలు