కోవిడ్‌-19 నెంబర్‌ ప్లేట్‌తో బీఎండబ్ల్యూ

14 Jul, 2020 16:27 IST|Sakshi

నెలల తరబడి పార్కింగ్‌లో..

అడిలైడ్‌ : కోవిడ్‌-19 నెంబర్‌ ప్లేట్‌ కలిగిఉన్న బీఎండబ్ల్యూ కారు నెలల తరబడి అడిలైడ్‌ విమానాశ్రయం వద్ద పార్క్‌ చేసి ఉండటం ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందిలో ఉత్కంఠ రేపుతోంది. కోవిడ్‌-19 నెంబర్‌ ప్లేట్‌తో కూడిన బూడిద రంగులో ఉన్న ఈ బీఎండబ్ల్యూ కారు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆస్ర్టేలియాలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఈ లగ్జరీ కారు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి కేటాయించిన పార్కింగ్‌లోనే ఉండిపోయింది. ఈ కారు ఫిబ్రవరి నుంచి ఇక్కడ ఉందని తమ సహచరులు చెబుతుండగా, అంతకన్నా ముందే తాము దాన్ని అక్కడ చూశామని మరికొందరు చెప్పారని ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే స్టీవెన్‌ స్ర్పై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. అంతకుముందు కారుపై కవర్‌ ఉండేదని, ఏప్రిల్‌లో వీచిన గాలులతో కవర్‌ మాయమైందని, కారుకు ఉన్న నెంబర్‌ ప్లేట్‌ కారణంగా సిబ్బందిలో దీని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత నెలకొందని చెప్పారు.

టెర్మినల్‌కు అతిదగ్గరగా ఉండే ప్రదేశంలో ఇంతటి ఖరీదైన కారును ఎందుకు వదిలివేసి వెళ్లారనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. ఈ కారు సుదూర ప్రయాణానికి వెళ్లిన పైలట్‌కు చెందినదని తాము భావిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో విదేశాలకు వెళ్లిన పైలట్‌ ఆ తర్వాత అక్కడే చిక్కుకుపోయి ఉంటాడని అంచనా వేస్తున్నామని అన్నారు. విమానాశ్రయ సిబ్బంది తమ కార్లను 48 గంటల పాటు ఇక్కడ పార్క్‌ చేసుకునేందుకు అధికారులు అనుమతిస్తారు. కోవిడ్‌-19 నెంబర్‌ ప్లేట్‌తో కూడిన బీఎండబ్ల్యూ 2020 సెప్టెంబర్‌ 26 వరకూ నమోదై ఉందని ప్రభుత్వ ఈజీరెజ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. సోషల్‌ మీడియాలో ఈ కారు ఫోటో వైరల్‌ కావడంతో నెటిజన్లు సెటైర్లు విసిరారు. కారు ఐసోలేషన్‌లో ఉందని ఓ యూజర్‌ చమత్కరించగా, ఈ నెంబర్‌ ప్లేట్‌తో ఉన్న కారును దొంగిలించే సాహసం ఎవరూ చేయరని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఈ బీఎండ్ల్యూ క్వారంటైన్‌లో ఉందని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు. చదవండి : త్వరలో శుభవార్త అందించబోతున్నాం: ట్రంప్‌

మరిన్ని వార్తలు