ట్యాంకులో హైడ్రోజన్ కొట్టు గురూ...

16 Sep, 2016 04:22 IST|Sakshi
ట్యాంకులో హైడ్రోజన్ కొట్టు గురూ...

మనిషికి ఆక్సిజన్ కావాలి. కారుకు పెట్రోలు కావాలి. పోనీ డీజిల్ అయినా. కాని ఈ కారు హైడ్రోజన్ అడుగుతుంది. దాంతోనే పరిగెడుతుంది.  నెదర్లాండ్స్‌కు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన ఈ కారు పేరు ‘ఫోర్జ్ వీ2’. ఇది పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటి సంప్రదాయ ఇంధన వనరులు కాకుండా హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకుంటుంది. హైడ్రోజన్ అత్యంత సమర్థమైన ఇంధనమే కాదు... ఏమాత్రం కాలుష్యం వెలువరించదు. కాకపోతే దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మనం ఇప్పటికీ పెట్రోలు, డీజిల్ కార్లనే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫోర్జ్ వీ2లో ఒక ఫ్యూయెల్ సెల్, హైడ్రోజన్ ట్యాంకులు ఉంటాయి.



ఈ ఫ్యూయెల్ సెల్ హైడ్రోజన్ ట్యాంకులలోని హైడ్రోజన్‌ను వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్తును, నీటిని తయారు చేసి ఇంజన్‌కు ఇంధనంగా అందిస్తుంది. ఒకసారి ట్యాంకుల్ని హైడ్రోజన్‌తో నింపితే దాదాపు 45 నిమిషాలపాటు వంద కిలోవాట్ల శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి ఫోర్జ్ వీ2ను కేవలం నాలుగు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగానికి తీసుకెళుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు గనుక ఇప్పటికే పెట్రోలు, డీజిల్ కార్లతో పోటీపడుతూ కొన్ని రేసులను గెలిచింది.

ప్రస్తుతం దీన్ని వీలైనంత ఎక్కువ దూరం నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో 24 గంటలపాటు జరిగే లీమ్యాన్స్ రేస్‌లో పోటీకి దించాలని తయారీదారులు భావిస్తున్నారు. కేవలం హైడ్రోజన్‌తో నడిచే కార్లు మాత్రమే పోటీపడే రేస్ ఇది. ఇందులోనూ మంచి ఫలితాలు సాధిస్తే మరిన్ని రేసుల్లో పాల్గొనేందుకు మార్గం సుగమం అవుతుంది.

మరిన్ని వార్తలు