వస్తుంది.. ఇస్తుంది.. వెళుతుంది..

14 Aug, 2017 04:05 IST|Sakshi
వస్తుంది.. ఇస్తుంది.. వెళుతుంది..

సరుకులైపోతే ఇంట్లోంచి కదలకుండానే ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేయడం నగరజీవులకు అలవాటైన విషయమే. కానీ ఎవరో ఒకరు వీటిని కొట్టునుంచి మోసుకొచ్చి మనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపై ఆ బాధా ఉండదు. ఎందుకంటారా? ఫొటో చూడండి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని గ్రీన్‌విచ్‌ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న కొత్త సర్వీస్‌ ఇది. దీని పేరు కార్గోపాడ్‌. ఆక్స్‌బోటికా అనే సంస్థ అభివృద్ధి చేసిన స్వతంత్ర (డ్రైవర్‌ అవసరం లేని) రవాణా వ్యవస్థ ప్రస్తుతం ఒకాడో అనే సూపర్‌మార్కెట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది.

పూర్తిగా విద్యుత్తుతోనే నడిచే ఈ వాహనంలో ఇంటెల్‌ ఐకోర్‌ –7 మైక్రోప్రాసెసర్‌ ఆధారంగా పనిచేసే కంప్యూటర్‌ వ్యవస్థ ఉంటుంది. వాహనం చుట్టూ రకరకాల సెన్సర్లు, కెమెరాలు అమర్చారు. వీటి ఆధారంగా ఈ వాహనం తన పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగుతుందన్నమాట.  మనకు కావాల్సిన సరుకులను స్టోర్‌ వెబ్‌సైట్‌పై ఆర్డరిచ్చిన వెంటనే కార్గోపాడ్‌ తన పని మొదలుపెడుతుంది. ఇచ్చిన ఆర్డర్‌ తాలూకూ అడ్రస్‌ను బట్టి వాహనంలో ఖాళీని కేటాయిస్తుంది. స్టోర్‌ సిబ్బంది సరుకులతో రాగానే ఆ ఖాళీ తాలూకూ తలుపు  తెరుచుకుంటుంది. ఆ వెంటనే సరుకులతో అడ్రస్‌కు బయలుదేరుతుంది.

అడ్రస్‌ను చేరుకోగానే ముందుగానే నిర్ధారించుకున్న కోడ్‌ ఆధారంగా బాక్స్‌ తలుపు తెరుస్తుంది. ఆర్డర్‌ చేసిన వాళ్లు సరుకులు తీసేసుకుంటారు. కార్గోపాడ్‌ పని అయిపోతుంది. స్టోర్‌కు తిరిగి వెళ్లిపోతుందన్నమాట. ప్రస్తుతం ఈ స్వతంత్ర వాహనం పనితీరును పరీక్షిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఒక డ్రైవర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా అనుకోని పరిస్థితులు ఎదురైతే వాహనాన్ని నియంత్రించేందుకు ఒక స్టీరింగ్‌ వీల్, బ్రేకులు కూడా ఉన్నాయి.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు