మహ్మద్‌ ప్రవక్తపై కార్టూన్‌ పోటీలు!

29 Dec, 2019 10:08 IST|Sakshi
గ్రీట్‌ విల్డర్స్‌ (ఫైల్‌ ఫోటో)

అమ్‌స్టర్‌డామ్‌ : ఇస్లాం దైవ ప్రవక్త మహమ్మద్‌పై వ్యంగ్య కార్టూన్‌ చిత్రాల పోటీని నిర్వహిస్తున్నట్టు నెదర్లాండ్‌ ప్రజా ప్రతినిధి గ్రీట్‌ విల్డర్స్‌ శనివారం ట్విటర్‌లో ప్రకటించారు. ఔత్సాహికులు తమ కార్టూన్‌ చిత్రాలను పంపాల్సిందిగా ఆయన కోరారు. నెదర్లాండ్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన గ్రీట్‌ విల్డర్స్‌ ఇస్లాం వ్యతిరేకులుగా పేరుగాంచారు. హింస, ఇస్లామిక్‌ ఫత్వాల మీద భావ ప్రకటనా స్వేచ్ఛది ఎప్పుడూ పైచేయి కావాలని విల్డర్స్‌ పేర్కొన్నారు. విల్డర్స్‌ ఈ పోటీని గతేడాది ఆగస్టులోనే  నిర్వహించాలనుకున్నారు. కానీ, ఆయనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో తన ప్రయత్నాన్ని మానుకున్నారు.

అంతేకాక, కార్టూన్‌ పోటీలను రద్దు  చేయాలంటూ పాకిస్తాన్‌లోని ఇస్లామిక్‌ పార్టీ తెహ్రీక్‌ ఎ లబ్బైక్‌ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రపంచంలోని ఇస్లామిక్‌ దేశాలన్నీ కూడా నెదర్లాండ్‌తో తమ దౌత్య సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో విల్డర్స్‌ గతేడాది పోటీలను రద్దు చేసి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. మహ్మద్‌ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చాలా మంది ముస్లింలు అభ్యంతరకరంగా భావిస్తారు. గతంలో చూస్తే 2005లో ఓ పత్రికలో మహ్మద్‌ ప్రవక్తపై వ్యంగ్య కార్టూన్‌ చిత్రాన్ని ప్రచురించినందుకు గాను కార్టూనిస్టు లేదా ఆ పత్రిక ఎడిటర్‌ను చంపాలని తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. తర్వాత పదేళ్లకు ప్యారిస్‌లో ఇద్దరు ముస్లిం గన్‌మెన్లు మహ్మద్‌ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంలో 12 మందిని కాల్చి చంపారు.    

మరిన్ని వార్తలు