-

పిల్లికూనని తీసేయకు!

30 Jun, 2015 18:39 IST|Sakshi
పిల్లికూనని తీసేయకు!

న్యూయార్క్: ముద్దొచ్చే పిల్లి కూనల వీడియోలు చూడడం, ఆన్‌లైన్‌లో వాటి ఫొటోలను చూడడం ఇంకెంత మాత్రం ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ కానే కాదు. వీటి వల్ల వీక్షకుల్లో శక్తి పెరగటమే కాకుండా మానసికోల్లాసం పెరుగుతుందట. దీన్ని పెట్ థెరపీ లేదా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వైద్య ప్రక్రియగా పేర్కొనవచ్చని ‘కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రిక తాజా సంచికలో వెల్లడించింది. 2014లో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన రెండు లక్షల పిల్లి వీడియోలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2600  కోట్ల సార్లు వీక్షించారని, సెలబ్రిటీ పిల్లులైన గ్రంపీ క్యాట్, లిల్‌బల్బ్‌లను కూడా సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూశారని ఇంటర్నెట్ డేటా ఆధారంగా ఆ పత్రిక తేల్చి చెప్పింది.

ఆన్‌లైన్ వీక్షణ వల్ల మానవ ప్రవర్తనపై కలిగే ప్రభావాల గురించి అధ్యయనం చేసే ఆ పత్రికకు ఎందుకు ఇంతమంది పిల్లి కూనల ఫొటోలు లేదా వీడియూలను చూస్తున్నారనే అనుమానం వచ్చింది. చూడడం వల్ల వారు ఎలా అనుభూతి చెందుతున్నారన్న కోణం నుంచి కూడా అధ్యయనం చేయాలని భావించి ‘స్నోబాల్’ టెక్నిక్ ద్వారా ఇంటర్నెట్ యూజర్స్‌కు ప్రశ్నావలిని పంపించి ఓ సర్వే నిర్వహించింది. పిల్లి వీడియోలను లేదా ఫొటోలను చూసినప్పుడు, అంతకుముందు, ఆ తర్వాత ఎలాంటి ఒత్తిడిలో ఉన్నారు? ఎలాంటి అనుభూతి పొందారు? ఆ తర్వాతి కార్యకలాపాల్లో ఉత్సాహం కనిపించిందా? లేదా ? లాంటి ప్రశ్నలతో ఈ సర్వేను నిర్వహించారు.

 ఈ ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ ప్రజల నుంచి ఒత్తిడి తగ్గిందని, మానిసికోల్లాసం పెరిగిందని, ఒంట్లో శక్తి పెరిగిందని, నిద్రమత్తు వదిలిందని, ఆ తర్వాత మరింత ఉత్సాహంగా అకాడమిక్ అధ్యయనం కొనసాగించామని సమాధానాలు వచ్చాయని, వాటిని విశ్లేషించి తమ అధ్యయన వివరాలు వెల్లడిస్తున్నామని ఇండియాన యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైరిక్ తెలిపారు. 36 శాతం మంది తమకు పిల్లులంటే ఇష్టమని, 60 శాతం మంది తమకు పిల్లులూ, కుక్క పిల్లలు ఇష్టమని చెప్పారని ఆమె వివరించారు. పిల్లులు విషయంలో స్పందించిన వారిలో ఎక్కువ మంది పిల్లులు యజమానులు లేదా మాజీ యజమానులే ఉన్నారని చెప్పారు. అయితే సర్వేను కేవలం పది నిమిషాల్లో నిర్వహించడం, కేవలం ఏడువేల మంది మాత్రమే పాల్గొనడం, వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం సర్వే ప్రామాణికతను తగ్గిస్తోంది.
 

మరిన్ని వార్తలు