మరోసారి కాటేస్తుంది జాగ్రత్త!

23 Apr, 2020 04:38 IST|Sakshi
రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌

అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉన్నతాధికారి

వాషింగ్టన్‌/బీజింగ్‌/ఇస్లామాబాద్‌: కరోనా మహమ్మారి ఈ ఏడాది చివరిలో తీవ్రంగా అమెరికాపై విరుచుకుపడే అవకాశముందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ హెచ్చరించారు. అమెరికాలో దాదాపు 8.24 లక్షల మంది వైరస్‌ బారిన పడగా, 45 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అమెరికాలో ఒకవైపు ఫ్లూ మరోవైపు కరోనా వైరస్‌లు విజృంభిస్తాయని రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తొలిదశలో కరోనా వైరస్‌ వ్యాప్తికి ఫ్లూ తోడై ఉండిఉంటే తట్టుకోవడం కష్టమయ్యేదనీ, అదృష్టవశాత్తూ ఫ్లూ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా వచ్చిందన్నారు. రానున్న శీతాకాలంలో ఇప్పటి కంటే తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఇమ్రాన్‌కు కరోనా పరీక్ష
పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బుధవారం కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ ఈదీ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఫైసల్‌ ఈదీ ఇటీవల ఇమ్రాన్‌ను సందర్శించడం, ఆ తరువాత ఆ వ్యక్తి కరోనా వైరస్‌ బారిన పడిన నేపథ్యంలో ఈ పరీక్షలు అవసరమయ్యాయి. కాగా, ఇమ్రాన్‌కు నెగటివ్‌ అని పరీక్ష ఫలితాల్లో తేలింది.

అమెరికాలో చైనాపై కేసు
కరోనా వైరస్‌ విషయంలో చైనా వ్యవహారాలను ప్రశ్నిస్తూ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం ఒక కేసు దాఖలు చేసింది. సమాచారాన్ని తొక్కిపెట్టడం, ముందస్తు హెచ్చరికలు చేసిన వారిని అరెస్ట్‌ చేయడం, వైరస్‌ అంటువ్యాధి లక్షణాన్ని తిరస్కరించడం ద్వారా చైనా ప్రపంచానికి సరి చేయలేనంత నష్టం కలుగజేసిందని, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు మానవ బాధలకు కారణమైందని మిస్సోరి అటార్నీ జనరల్‌ ఎరిక్‌ షిమిట్‌ స్థానిక కోర్టులో ఈ కేసు దాఖలు చేశారు.

వూహాన్‌ డైరీ రచయితపై వ్యతిరేకత
కరోనా వైరస్‌ పుట్టినిల్లు వూహాన్‌లో లాక్‌డౌన్‌ పరిస్థితులపై ఓ పుస్తకం రాసిన చైనా రచయిత ఫాంగ్‌ఫాంగ్‌పై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫాంగ్‌ఫాంగ్‌ తన ఆన్‌లైన్‌ డైరీలో వూహాన్‌లోని పరిస్థితులను వివరించారు. రోగులతో నిండిన ఆస్పత్రులు, చికిత్స అందించలేమంటూ కొందరిని తిప్పి పంపడం, రోగుల బంధువుల మరణాల వంటి విషయాలను పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు