చుక్కలు చూపించిన విమానం!

1 Jun, 2016 17:12 IST|Sakshi
చుక్కలు చూపించిన విమానం!

న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది.  సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.

న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు  ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి  టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు.

అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే  అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం.

మరిన్ని వార్తలు