సెల్ఫోన్ కు బానిసైతే.. కుటుంబ బంధాలు విచ్చిన్నం

11 Mar, 2014 15:28 IST|Sakshi
సెల్ఫోన్ కు బానిసైతే.. కుటుంబ బంధాలు విచ్చిన్నం

న్యూయార్క్: ఈ మెయిల్స్ పంపడం..ఆఫీస్ ఫోన్ కాల్స్కు స్పందించడం..గేమ్స్ ఆడటం.. ఇలా చాలా మంది మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటారు. కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసేటపుడు కూడా ఫోన్ను ఇలాగే వాడుతారా? డిన్నర్ పూర్తయ్యే వరకు ఫోన్ పక్కనపెట్టకుండా మాట్లాడుతూనే ఉంటారా? ఎవరికైనా ఈ అలవాటు ఉంటే మానుకోవాలంటూ అమెరికాకు చెందిన ఓ పరిశోధక బృందం సూచిస్తోంది. ఫోన్ కాసేపు పక్కనబెట్టి పిల్లలతో సరదాగా గడపాలని చెబుతున్నారు. లేకుంటే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

బోస్టన్ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులు 55 మంది తల్లిదండ్రులపై పరిశోధన నిర్వహించారు. రెస్టారెంట్లలో పిల్లలతో కలసి భోజనం చేసేటపుడు పెద్దల వ్యవహారశైలి, పిల్లల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. కొంతమంది డిన్నర్ మొదలైన దగ్గర నుంచి రెస్టారెంట్ విడిచి వెళ్లేంత వరకు ఫోన్ వదిలిపెట్టరు. ప్రతి ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ అలవాటు ఉందని తేలింది. 73 శాతం మంది భోజన సమయంలో కనీసం ఒకసారైనా ఫోన్ వాడుతారని కనుగొన్నారు. దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రులపై అనుబంధం తగ్గుతుందని వెల్లడించారు. తల్లిదండ్రులు అప్యాయంగా గడపకపోవడం వల్ల పిల్లల మనసు గాయపడుతుందని హెచ్చరిస్తున్నారు. తమతో మాట్లాడకుండా ఫోన్లో ఏమి మాట్లాడుతున్నారనే దిశగా  పిల్లలు ఆలోచిస్తారని చెప్పారు. ఇలాంటి సంఘటనల వలన పిల్లల పెంపకంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు రానురాను పెద్దలతో  అనుబంధం తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు