కణం బరువును తూచే యంత్రం

29 Oct, 2017 01:55 IST|Sakshi

మన శరీరంలో కొన్ని కోట్ల కణాలున్నాయి కదా.. ఒక కణం బరువు ఎంతుంటుంది? అబ్బో అంత సూక్ష్మమైన దాన్ని తూచేదెలా? అని అనుకుంటున్నారా? ఇప్పటివరకు కష్టమయ్యేదేమోగానీ.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఈ పనిని సులువు చేసింది. బేసల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్, జ్యూరిచ్‌లోని ఈటీహెచ్‌ విశ్వవిద్యాలయాలు కలసి అత్యంత సూక్ష్మస్థాయిలోని కణం బరువును నిర్ధారించగల యంత్రాన్ని అభివృద్ధి చేశాయి.

లేజర్లు, పరారుణ కాంతి కిరణాల సాయంతో పనిచేసే ఈ యంత్రం ద్వారా ఒక గ్రాములో లక్ష కోట్ల వంతు తక్కువ బరువులను కూడా లెక్కించవచ్చు. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందంటే.. మైక్రోస్కోపు ద్వారా చూస్తుండగా శరీర కణాలున్న పాత్రలోకి ఓ సూదిలాంటి దాన్ని చొప్పిస్తారు. సూది పైభాగం స్థిరంగా ఉంటే.. అడుగు భాగాన్ని అటు ఇటూ కదలించేలా ఏర్పాటు ఉంటుంది.

సూది ఎప్పుడైతే అడుగు భాగాన్ని చేరుకుంటుందో దాని మొనకు కణం అతుక్కుంటుందని.. అప్పుడు నీలి రంగు లేజర్‌ ద్వారా సూది కంపించేలా చేస్తామని, పరారుణ కాంతి కిరణంతో ఈ కంపన తీవ్రతను లెక్కించడం ద్వారా దానికి అతుక్కున్న కణం బరువు తెలుస్తుందని ఈటీహెచ్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ మార్టినెజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు