రెండేళ్లకే చైన్ స్మోకర్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ?

27 Apr, 2017 10:42 IST|Sakshi
రెండేళ్లకే చైన్ స్మోకర్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ?

జకర్తా :
రెండేళ్ల చిరు ప్రాయంలోనే సిగరేట్ కాలుస్తూ ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు అల్ది రిజాల్. ఇండోనేషియాలోని సుమత్రాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అల్ది రిజాల్(2) స్మోకింగ్ చేస్తున్న ఫోటోలు 2010లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఓ చేతిలో సైకిల్ హ్యాండిల్, మరో చేత్తో సిగరెట్ పట్టుకుని పొగ ఊదుతూ ఉన్న అల్ది దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

ఆటబొమ్మలతో ఆడుకునే వయస్సులో రెండేళ్ల చిన్నారికి చైన్ స్మోకింగ్ అలవాటు ఏంటి అంటూ తీవ్రస్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు. అతనికి సిగరెట్లు ఎందుకు కొనిస్తున్నారంటూ చిన్నారి తల్లిదండ్రులను ఎడపెడా నెటిజన్లు వాయించేశారు. అంతేకాకుండా ఇండోనేషియా ప్రభుత్వాన్ని సైతం కడిగిపారేశారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అల్ది చైన్ స్మోకింగ్ ఘటనపై ఇండోనేషియా ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. మారుమూల పల్లెల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి సిగరెట్ తాగటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. చిన్నారికి ఇండోనేషియా ప్రభుత్వం ప్రత్యేక పునరావాసం కల్పించింది.  


రోజుకు కనీసం 40 సిగరెట్లను తాగే తన అలవాటును 2013లో అల్ది వదిలి పెట్టాడు. అయితే సిగరెట్లు పూర్తిగా మానేసే ప్రక్రియ మాత్రం అంత సులభంగా జరగలేదు.  సిగరెట్లను మానేసిన తర్వాత అల్ది ఆలోచన మొత్తం ఆహారం పై పడింది. దీంతో ఒక్క సారిగా బరువు పెరిగాడు.  డాక్టర్ సలహాతో తల్లిదండ్రులు ఆహారాన్ని అందించడంతో అల్ది మామూలు స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం తొమ్మిదేళ్ల వయసున్న అల్ది స్థానిక స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. అంతేనా చదువుల్లో దూసుకుపోతూ ఏకంగా టాప్ ర్యాంకర్గా పేరు తెచ్చుకున్నాడు.  అల్ది చిన్నతనంలో సిగరెట్ ఇవ్వకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడని, అస్సలు వినకపోయేవాడని అల్ది తల్లి డియానే రిజాల్ తెలిపారు. కానీ ఇప్పుడు సిగరెట్ తాగే ఆలోచనే అతనిలో లేదని చెప్పారు.








మరిన్ని వార్తలు