కరోనా సోకి ప్రముఖ చెఫ్‌ మృతి

26 Mar, 2020 08:37 IST|Sakshi

న్యూజెర్సీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రపంచ ప్రఖ్యాత చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌(59)ను బలితీసుకుంది. మార్చి 18న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా న్యూజెర్సీలోని మౌంటేన్‌సైడ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న హంగర్‌ ఐఎన్‌సీ. హాస్పిటాలిటీ సంస్థ ధ్రువీకరించింది. ‘‘చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాం’’అని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా బాంబేలో పుట్టిన ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ తొలుత బయోకెమిస్ట్‌గా శిక్షణ పొందారు. అనంతరం తన అభిరుచికి అనుగుణంగా చెఫ్‌గా మారారు. భారత్‌, స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొంది.. న్యూయార్క్‌కు షిఫ్ట్‌ అయ్యారు. ప్రఖ్యాత.. ‘‘టాప్‌ చెప్‌ మాస్టర్‌’’ టైటిల్‌ పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. (డేంజర్ బెల్స్!)

కాగా భారత సంతతికి చెందిన మరో సెలబ్రిటీ చెఫ్‌ పద్మా లక్ష్మి ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఫ్లాయిడ్‌ మనల్నందరినీ గర్వపడేలా చేశారు. న్యూయార్క్‌ వాసులు ఆయన చేతి రుచికరమైన భోజనాన్ని ఎన్నడూ మరచిపోలేరు. తన చిరునవ్వుతో చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచేవారు. ఆయన మరణం తీరని లోటు’’అని ట్విటర్‌లో విచారం వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్‌ తారాగణం సైతం ఫ్లాయిడ్‌ మృతికి సంతాపం తెలిపింది. క్యాన్సర్‌కు న్యూయార్క్‌లో చికిత్స పొందిన నటుడు రిషీ కపూర్‌ ఫ్లాయిడ్‌ చేతి వంటను గుర్తుచేసుకున్నారు. రాహుల్‌ బోస్‌, సోనం కపూర్‌ తదితరులు ఫ్లాయిడ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. (చైనా దాస్తోంది: పాంపియో )

మరిన్ని వార్తలు