చికెన్‌ కుర్మాలో శెనగలు.. భారీ ఫైన్‌

14 Oct, 2017 17:06 IST|Sakshi

లండన్‌: చికెన్‌ కుర్మాలో శెనగలు వేసి వండిన భారతీయ రెస్టారెంట్‌ షెఫ్‌కు అధికారులు భారీ జరిమానా విధించారు. తూర్పు ఇంగ్లండ్‌ ప్రాంతం గ్రిమ్స్‌బీలో 'మసాలా' ఇండియన్‌ రెస్టారెంట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ ఉద్దీన్‌ షెఫ్‌గా పనిచేస్తున్నాడు. మసాలా రెస్టారెంట్‌ లో తయారు చేసిన చికెన్‌ కుర్మాను ఆహార శాఖ అధికారులు 2016 లో తనిఖీ చేశారు. ​కుర్మాలో 6.8 మిల్లీగ్రాముల శెనగలు ఉన్నట్లు కనుగొన్నారు. మరోసారి తనిఖీ చేసినప్పుడు కూడా అటువంటి కల్తీనే గుర్తించారు.

దీనిపై సంబంధిత షెఫ్‌ను అధికారులు విచారించగా... కుర్మాలో శెనగలు ఎలా కలిశాయో తనకు తెలియదని, తాను వాటిని కలుపలేదని షెఫ్‌ మహ్మదుద్దీన్‌ అధికారులకు తెలిపారు. అయితే, శెనగలు లేకుండానే చికెన్‌ కుర్మా చేస్తున్నట్లు మెనూలో పేర్కొని, వాటిని కలపటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అంతే కాకుండా, కొందరు 5 మిల్లీ గ్రాములకు మించి శెనగలు ఆహారంలో ఉంటే అలెర్జీతో ఇబ్బందులు పడతారని, అవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని కలిపి ఆహార పదార్థాలు వండారని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు గాను షెఫ్‌ మహ్మదుద్దీన్‌కు 2,300 పౌండ్ల జరిమానా విధించారు.


( గ్రిమ్స్‌బీలోని 'మసాలా' ఇండియన్‌ రెస్టారెంట్‌ )

మరిన్ని వార్తలు