కరోనా టైమ్స్‌: ఆనంద్‌తో చెస్‌ ఆడే అవకాశం!

6 Apr, 2020 16:14 IST|Sakshi

పీఎం కేర్స్‌కు నిధులు సమకూర్చేందుకు యత్నం

అబుదాబి: కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు ఆరుగురు అగ్రశ్రేణి భారత చెస్‌ ఆటగాళ్లు ముందుకొచ్చారు. ఆన్‌లైన్‌లో చెస్‌ ఆడటం ద్వారా వచ్చిన సొమ్మును పీఎం కేర్స్‌ అందిస్తామని ప్రపంచ మాజీ చెస్‌ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఈ సందర్భంగా చెప్పారు. ఆనంద్‌తో పాటు మొత్తం ఐదుగురు ఆటగాళ్లు యూఏఈ వేదికగా ఏప్రిల్‌ 11 న (శనివారం) సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో చెస్‌ ఆడనున్నారు. తెలుగు గ్రాండ్‌ మాస్టర్లు కోనేరు హంపి, పి.హరికృష్ణ, ద్రోణవల్లి హారికతో పాటు.. విశ్వనాథన్‌ ఆనంద్‌, బి.అధిబన్‌, విదిత్‌ గుజరాతి ఆన్‌లైన్‌ గేమ్‌లో భాగమవుతారు. chess.com పోర్టల్‌ ద్వారా ఈ గేమ్‌ నిర్వహిస్తారు.

కాగా, భారత టాప్‌ చెస్‌ ప్లేయర్లతో ఆడాలనుకు వారు 25 డాలర్లతో పేరు నమోదు చేసుకోవాలి. కనీసం 150 అమెరికన్‌ డాలర్లు చెల్లించినవారు కచ్చితంగా ఆనంద్‌తో ఆడే అవకాశం దక్కించుకుంటారు. లేదంటే ఎవరైనా ఇద్దరు భారత ఆటగాళ్లతో (ఆనంద్‌ సహా) తలపడే వీలుంది. ‘నూతన ప్రయత్నాలు చేసేందుకు ఇవే మంచి సమయాలు. ఇంటి వద్ద ఉన్నప్పుడు సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం. చెస్‌ ఫ్యామిలీ బాండ్‌​ ఉన్న ఆట. దీనిని బోర్డుపైనా, ఆన్‌లైన్‌లో కూడా ఆడొచ్చు’అని ఆనంద్‌ పేర్కొన్నారు. కాగా, గతవారం ఆనంద్‌తోపాటు మరో 48 మంది క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహన కల్పించాలని ప్రధాని వారికి  విజ్ఞప్తి చేశారు. ఇక భారత్‌ వ్యాప్తంగా 4 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు. ఇదిలాఉండగా..  లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఆనంద్‌ జర్మనీలో చిక్కుకు పోయారు. 

మరిన్ని వార్తలు