ఛోటా రాజన్‌ను పట్టించింది నేనే

27 Oct, 2015 10:42 IST|Sakshi
ఛోటా రాజన్‌ను పట్టించింది నేనే

నేర సామ్రాజ్యాన్ని తనదైన శైలిలో ఏలిన ఛోటా రాజన్ ఇంతకీ ఎలా పట్టుబడ్డాడో తెలుసా.. అతడి బద్ధశత్రువు, మరో మాఫియా నాయకుడు షకీల్ షేక్.. అలియాస్ ఛోటా షకీలే పట్టించాడట. నిజానికి 15 ఏళ్ల క్రితమే ఛోటా రాజన్‌ను బ్యాంకాక్‌లో చంపించేందుకు షకీల్ ప్లాన్ వేశాడు. ఇప్పుడు రాజన్ అరెస్టు తనకేమంత సంతోషంగా అనిపించట్లేదని చెప్పాడు. గత వారంలో కూడా తన మనుషులు ఫిజీలో ఛోటా రాజన్‌ను చంపేందుకు ప్రయత్నించారని, అతడు ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో అన్నీ తమకు తెలుసని ఛోటా షకీల్ చెప్పాడు. తర్వాత అతడు ఇండోనేసియాకు పారిపోతున్న విషయం తెలిసి.. అతడిని అరెస్టు చేయించానన్నాడు. డి కంపెనీ కూడా తమ శత్రువు అరెస్టును జీర్ణించుకోలేకపోతోంది. తమ శత్రుత్వం ఇక్కడితో ముగిసిపోయేది కాదని మాఫియా నాయకులు అంటున్నారు. ఎలాగైనా అతడిని చంపాలనుకుంటున్నానని, అప్పటివరకు విశ్రమించేది లేదని షకీల్ అన్నాడు. అతడిని భారతదేశానికి పంపేసినా కూడా తన ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపాడు.

తాను భారత ప్రభుత్వాన్ని నమ్మేది లేదని, వాళ్లే ఇన్నాళ్లబట్టి రాజన్‌ను పెంచి పోషించారని, తమమీదకు ఉసిగొల్పారని షకీల్ మండిపడ్డాడు. అసలు భారతదేశంలో అతడి మీద విచారణ జరిగి, శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు లేదన్నాడు. శత్రువును ఖతమ్ చేయడమే తమ ఫండా (లక్ష్యం) అని తనదైన శైలిలో షకీల్ చెప్పాడు. అతడు ఎక్కడున్నా క్షమించేది లేదని స్పష్టం చేశాడు.

దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం లాంటి ఛోటా షకీల్.. ఎప్పటినుంచో రాజన్ కోసం వెతుకుతున్నాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత రాజన్.. దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయాడు. 2000 సెప్టెంబర్ నెలలో రాజన్ మీద బ్యాంకాక్‌లో దాడి చేయించింది ఛోటా షకీలే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజన్.. ఆస్పత్రిపాలయ్యాడు. ఆ తర్వాత తన అనుచరుల సాయంతో ఆస్పత్రి నుంచి పారిపోయాడు.

ఈ రెండు గ్యాంగుల మధ్య దాదాపు రెండు దశాబ్దాల వైరం ఉంది. అటు ఇటు జరిగిన దాడుల్లో రెండు గ్యాంగులకు చెందిన చాలామంది హతమయ్యారు. వాళ్లలో ముందుగా మరణించింది దావూద్‌కు సన్నిహిత అనుచరుడు శరద్ శెట్టి. ఆ తర్వాత బిల్డర్ ఓపీ కుక్రేజా, ఎయిర్‌లైన్స్ సంస్థ ఎండీ టకీయుద్దీన్ వాహిద్, నేపాల్ ఎమ్మెల్యే మీర్జా బేగ్, అక్కడి కేబుల్ ఆపరేటర్ జమీమ్ షా, పర్వేజ్ తండా.. ఇలా ఒకరి తర్వాత ఒకరు నేలకొరిగారు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు కుట్రపన్నిన వాళ్లు ఒక్కొక్కరిని రాజన్ చంపడం మొదలుపెట్టాడు. సలీమ్ కుర్లా, మజీద్ ఖాన్, మహ్మద్ జింద్రన్.. ఇలాంటి వాళ్లు ఛోటా రాజన్ గ్యాంగు చేతిలో నేలరాలారు.

మరిన్ని వార్తలు