చికాగోలో అకృత్యం: షాకింగ్ నిజాలు

5 Apr, 2017 10:26 IST|Sakshi
చికాగోలో అకృత్యం: షాకింగ్ నిజాలు

చికాగో: అమెరికాలో కొన్ని రోజుల కిందట చోటుచేసుకున్న మైనర్ గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. చికాగోలో ఇంట్లో నుంచి షాపింగ్ మాల్ కు వెళ్లిన 15 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ అన్ చేసి ఆ అకృత్యానికి ఒడిగట్టిన నిందితులలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డ కేసులో ఇద్దరు మైనర్లు 14 ఏళ్లు, 15 ఏళ్లు ఉన్నారు. బాధిత బాలికకు ఈ ఇద్దరు తెలిసిన వాళ్లేనని విచారణలో తేలింది.

బాలికపై అఘాయిత్యానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డామని ఒప్పుకున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారమే.. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మహా గార్డ్ నర్ వెల్లడించారు. బాలిక షాపింగ్ కు వెళ్తుంటే ఆమెను వెంబడించారు. అనంతరం దగ్గర్లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అ‍త్యాచారానికి పాల్పడ్డారు. బాలుర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తమ వద్ద ఉన్న కుక్కను ఆమె మీదకి వదులుతామని బెదిరించి పారిపోకుండా చేశారని బాధితురాలు కోర్టులో తన ఆవేదన వెల్లగక్కింది. తనను చాలాసార్లు చెంపదెబ్బలు కొట‍్టారని కన్నీటి పర్యంతమైంది.

మైనర్లు ఈ అకృత్యానికి పాల్పడిన సమయంలో ఫేస్ బుక్ లైవ్ పెట్టారని, దాదాపు నలబై మంది వీడియో చూశారని.. అయితే ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని చికాగో పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫేస్ బుక్ పేజీ ఆధారంగా బాలురను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్ తర్వాత వీడియోను కొన్ని ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్ట్ చేశారని, ఇది చాలా దారుణ విషయమని తప్పుచేసింది మైనర్లు అయినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. మైనర్లు అయినందున వారి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కూతురిని స్కూలుకు పంపించాలంటే భయంగా ఉందని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తల్లి వాపోయారు.

మరిన్ని వార్తలు