చిన్నారికి బ్రెయిన్‌ క్యాన్సర్‌.. ఊహించని సర్‌ప్రైజ్‌

20 Dec, 2019 14:21 IST|Sakshi

క్యాన్సర్‌తో బాధ పడుతున్న చిన్నారికి మధురానుభూతులు మిగిల్చారు తోటి విద్యార్థుల తల్లిదండ్రులు. తనకు ఇష్టమైన ‘రెక్కల గుర్రం’  స్వారీ ఏర్పాటు చేసి.. సర్జరీకి వెళ్లేముందు రోజు అతడిని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సదరు బాలుడి కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అమెరికాకు చెందిన వ్యాట్‌ హాస్‌ అనే ఐదేళ్ల బాలుడు అరుదైన బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నవంబరు 15న అతడికి సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు వ్యాట్‌ తల్లిదండ్రులకు చెప్పారు. తమ పిల్లల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వ్యాట్‌ స్నేహితుడి తల్లి జెన్నిఫర్‌ నీల్సన్‌.. అతడికి ఊరట కలిగించాలని భావించారు. ఇందుకోసం.. వ్యాట్‌కు ఇష్టమైన యూనికార్న్‌ థీమ్‌తో డిజైన్‌ చేసిన గుర్రాల దగ్గరికి అతడిని తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. వ్యాట్‌ తల్లిదండ్రులతో పాటు వ్యాట్‌ క్లాస్‌మేట్లకు తమ ప్లాన్‌ గురించి వివరించారు.

ఈ క్రమంలో తమను కలవడానికి పార్కుకు రావాల్సిందిగా వ్యాట్‌తో పాటు అతడి తల్లిదండ్రులకు ఆహ్వానం పంపించారు. ఇక అక్కడికి వెళ్లగానే స్నేహితులతో పాటుగా.. యూనికార్న్‌ను చూసిన వ్యాట్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. గుర్రంపై పార్కు అంతటా తిరుగుతూ సందడి చేశాడు. ఈ విషయాన్ని వ్యాట్‌ తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ‘ మేమొక అద్భుతమైన చోటుకు వెళ్లాము. వాళ్లకు ఎంతగానో రుణపడి ఉంటాం. మీతో ఈ ఫొటోలు పంచుకోవడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇక పదిహేను రోజుల క్రితం షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో నీల్సన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘వ్యాట్‌ ఎంతగా సంతోష పడుతన్నాడో అతని కళ్లలో తెలిసిపోతోంది. అతడి ఆరోగ్యం బాగుపడాలని..  మేము కూడా కోరుకుంటాం. మీది చాలా గొప్ప మనసు’ అని కామెంట్లు చేస్తున్నారు. 


 

>
మరిన్ని వార్తలు