హృదయాలను కదిలిస్తున్న ఫోటో..

11 Sep, 2019 12:30 IST|Sakshi

కుటుంబంలో ఎవరికైనా కాన్సర్‌ వ్యాధి సోకితే అది ఆ కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్రతపై ఆందోళనతోపాటు, వైద్యానికయ్యే భారీ ఖర్చు, కీమో థెరపీ, దుష్ప్రభావాలు లాంటివాటిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ వీటన్నిటికి మించిన మరో కీలక విషయం వుందంటూ ఒకతల్లి తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ  మహమ్మారి బారిన పడితే, వారి తోబుట్టువులు అనుభవించే వేదన, బాధ వర్ణనాతీతమంటూ ఒక ఫోటోను షేర్‌ చేశారు. హృదయాలను ద్రవింపచేస్తున్న ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా వేలాది నెటిజనుల కంట తడి పెట్టిస్తోంది.

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన  కైట్లిన్ బర్జ్ (28)  ఈ ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతున్న తన కుమారుడు బెకెట్ బర్జ్ (4) పై  బెకెట్‌ స్ట్రాంగ్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీలో తన భావాలను రాసుకొచ్చారు.  అతని 5 సంవత్సరాల సోదరి ఆబ్రే బెకెట్‌ ఎంత  దయతో​ సేవ చేస్తోందో,  అతనికి వచ్చిన వ్యాధిపై  అయోమయానికి గురి అవుతూ ఎంత ఆందోళన చెందుతోందో  తెలిపారు. 

ఇంత చిన్న వయసులో తన పాపకు ఇవన్నీ ఎందుకు అనుభవంలోకి వచ్చేలా చేసామో కూడా ఆమె వివరణ ఇచ్చారు. ముఖ్యంగా తోబుట్టువులను అనారోగ్యంతో ఉన్నవ్యక్తికి దూరంగా ఉంచకూడదనీ, వారి పూర్తి మద్దతు, సహకారం అవసరం అని తెలిపారు.  అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరిస్థితులతో సంబంధం లేకుండా మనకు ఎంత ప్రేమ ఉందో, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో వారికి తెలియాలని పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఆబ్రే తన సోదరుడికి నిజంగా ఎంతో సేవ చేసింది. ఏం జరుగుతోందో పూర్తిగా అర్థం కానప్పటికీ ..నిరంతరం అతణ్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. నమ్మశక్యం కాని బంధం వారిద్దరిదీ. బెకెట్‌కు వ్యాధి సోకడం చాలా బాధగా ఉన్నప్పటికీ, వారిద్దరికి ఒకరిపై మరొకరికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత చాలా సంతోషాన్నిస్తోందని ఆమె రాసారు. 

మరిన్ని వార్తలు