యుద్ధం వస్తే చైనానే అండ

18 Aug, 2019 15:57 IST|Sakshi

బీజింగ్‌ : చైనా, ఉత్తరకొరియాలు రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా భయాల నేపథ్యంలో ఈ రెండు దేశాలు వ్యూహాత్మకంగా కలసి పనిచేయాలని, యుద్ధం వస్తే ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాయి. ఉత్తరకొరియా ఉన్నతస్థాయి మిలటరీ బృందం తాజాగా చైనా మిలటరీ బృందంతో బీజింగ్‌లో సమావేశం అయింది. ఈ సందర్భంగా ఉత్తరకొరియా సైనిక అధికారి మాట్లాడుతూ బీజింగ్‌, ప్యాంగ్‌యాంగ్‌ల రక్షణ సహకారం ఈ చర్చలతో మరింత ఎత్తుకు చేరుకుంటుందని ఆశాబావం వ్యక్తం చేశారు. 

దక్షిణ కొరియాతో కలసి అమెరికా సైనిక విన్యాసాలు నిర్వహిస్తే తాము అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఉత్తరకొరియా హెచ్చరిస్తున్న సంగతి తెల్సిందే. అమెరికాను ఉడికిస్తూ క్షిపణి పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. దీనిపై జోక్యం చేసుకున్న దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌జేఇన్‌ను సిగ్గులేని వ్యక్తిగా అభివర్ణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాతో భాగస్వామ్యం కోసం మిలటరీ బృందం చైనాకు వెళ్లింది. క్షిపణి పరీక్షలతో వార్తల్లో నిలిచి అమెరికా ఆగ్రహాన్ని చవిచూసిన ఉత్తర కొరియా ఇప్పుడు చైనాతో భాగస్వామ్యం మరింత పెంచుకోవాలని చూడటం ప్రాధాన్యత సంతరించుకొంది. పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతకు తోడ్పడటానికి చైనాతో పాటు ఉత్తరకొరియా సిద్ధంగా ఉందని, బలమైన పొరుగుదేశంతో మేం మరింత బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని ఉత్తర కొరియా ఈ సందర్భంగా తెలిపింది.

కాగా, చైనా సైతం తమ భౌగోళిక ఉమ్మడి శత్రువులు అయిన జపాన్‌, దక్షిణకొరియా అలాగే  ఈ ప్రాంతంలో తరచూ జోక్యం చేసుకుని తమ ఆదిపత్యాన్ని సవాలు చేస్తోన్న అమెరికాను ఎదుర్కోవడానికి మంచి పొరుగు మిత్రునిగా ఉత్తరకొరియాను చూస్తోంది. 14 సంవత్సరాల నుంచి చైనా నాయకుడు ఉత్తరకొరియాకు వెళ్లలేదు. దీన్ని చెరిపేస్తూ గత నెలలో చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌ ఆ దేశ పర్యటనకు జూన్‌లో వెళ్లారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో ఆయన చేసిన చర్చలు చారిత్రాత్మక మిత్రదేశాల మధ్య సంబంధాలకు కొత్త ప్రేరణనిచ్చాయని ఒక ప్రకటనలో ఇరు దేశాలు తెలిపాయి. యుద్ధం సంభవిస్తే చైనా, ఉత్తరకొరియాలు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని 1961లోనే ఒక ఒప్పందం చేసుకున్నా అది అంత సమర్థవంతంగా లేదని ఉత్తరకొరియా భావన. అందుకే తాజాగా అమెరికా భయాలతో మరింత విస్తృతమైన ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది.

ఇక చైనాకు, అమెరికాకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ విషయంలో అమెరికా జోక్యంపై చైనా తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతవారం అమెరికా విదేశాంగమంత్రి మైక్‌పాంపియో మాట్లాడుతూ పసిఫిక్‌ ప్రాంత మ్యాపును చైనా తన ఏకపక్ష బలవంతపు విధానాలతో తిరగరాయాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. దీనికి చైనా కౌంటర్‌ ఇస్తూ.. ఈ ప్రాంతంలో మరకలను అంటించి అసమ్మతి విత్తనాన్ని నాటడానికి తరచుగా ఓ దేశం గుంటనక్కలా కాచుకు కూర్చోందని  ఘాటుగా విమర్శించింది.

మరిన్ని వార్తలు