ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేసిన చైనా

13 Sep, 2016 13:12 IST|Sakshi
ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేసిన చైనా

బీజింగ్: కాలేజీ విద్యార్థితో సహా ఐదుగురిని చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. కున్మింగ్ నగరంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 27 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కోల్కతాలోని కిడర్పోర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. గంజాయి పాకెట్లను ల్యాప్టాప్ బాగుల్లో పెట్టుకుని అక్రమ రవాణా చేస్తుండగా వీరిని అరెస్ట్ చేశారు. అయితే తమకు ఏ పాపం తెలియదని నిందితులు పేర్కొన్నారు. వీరి వయసు 22 నుంచి 46 ఏళ్ల మధ్య ఉంటుందని వెల్లడైంది.

అరెస్టైన వారిలో ఒకరు కోల్కతాలోని శ్యామప్రసాద్ కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు పలుమార్లు చైనాకు వచ్చినట్టు కనుగొన్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను చైనాలో తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. జూలైలో కొకైన్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన కొలంబియా మోడల్ జూలియానా లోపజ్ కు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

గత నెల 26న కోల్కతాకు చెందిన ఇద్దరిని చైనా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 9 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6 మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు