పాక్కు చైనా అభయం

25 Sep, 2016 06:46 IST|Sakshi
పాక్కు చైనా అభయం

ఏ దేశమైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే అండగా ఉంటామని హామీ

లాహోర్: కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలికింది.  విదేశీ శక్తులేవైనా పాక్‌పై దుందుడుకు చర్యలకు దిగితే తాము అండగా నిలుస్తామని అభయ హస్తమిచ్చింది. లాహోర్‌లోని చైనా కాన్సుల్ జనరల్ యూ బోరెన్.. పాకిస్తాన్ పంజాబ్  రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ సందర్భంగా ఈమేరకు హామీ ఇచ్చినట్లు షాబాజ్ కార్యాలయం తెలిపింది. ‘కశ్మీర్  విషయంలో మేం పాక్ పక్షాన ఉన్నాం. ఉంటాం. నిరాయుధులైన కశ్మీరీలపై దాడులు జరపడం ఏ విధంగానూ సహేతుకం కాదు.

కశ్మీరీల ఆకాంక్షకు అనుగుణంగా వివాదానికి పరిష్కారం కనుగొనాలి’ అని బోరెన్ లాహోర్‌లో జరిగిన ఈ భేటీలో అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ నెల 18న జమ్మూ కశ్మీర్‌లోని ఉడీలో జరిగిన ఉగ్రదాడిలో 18 మంది భారత జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇది పాక్ చేయించిన దాడేననీ, ప్రతీకారంగా పాక్‌పై భారత్ దాడి చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో చైనా దౌత్యవేత్త పై వ్యాఖ్యలు చేశారు. షాబాజ్ 65వ జన్మదినం సందర్భంగా బోరెన్ ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

ఏకాకిగా మిగిలిన పాక్: భారత్
న్యూయార్క్: ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాక్.. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రపంచ దేశాలు మాత్రం పట్టించుకోవడంలేదని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. తాజా ఐరాస చర్చలో పాక్ ప్రధాని షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం తెలిసింతే. అయితే ఈ విషయంలో పాక్ ఏకాకిగా మిగిలిపోయిందని, చర్చలో131 దేశాల్లో 130 దేశాలు ఉగ్రవాదంపై పోరుపై మాట్లాడాయని సయ్యద్ చెప్పారు.

మరిన్ని వార్తలు