పాకిస్తాన్‌కు చైనా మద్దతు

5 Nov, 2018 10:57 IST|Sakshi
లీ కెకియాంగ్‌, ఇమ్రాన్‌ఖాన్‌

బీజింగ్‌: భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సమస్యలను కేవలం శాంతి చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే 48 దేశాలు సభ్యులుగా ఉన్న అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో పాకిస్తాన్‌ సభ్యత్వానికి మద్దతిస్తున్నట్లు వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని లీ కెకియాంగ్‌తో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బీజింగ్‌లో సమావేశమై చర్చలు జరిపిన నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ఆదివారం సంయుక్త ప్రకటనను విడుదల చేసింది.

‘పరస్పర గౌరవంతో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న పాకిస్తాన్‌ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. భారత్‌–పాక్‌ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు పాక్‌ చేస్తున్న కృషికి మద్దతు తెలుపుతున్నాం. పాక్‌ ఉగ్రవాదుల ఏరివేతలో అద్భుతంగా పనిచేస్తోంది. తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం– ఈ మూడింటిపై పరస్పర సహకారంతో పోరాడేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. తూర్పు టర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌(ఈటీఐఎం), అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలు తమ భూభాగాన్ని వాడుకోకుండా, చైనా సార్వభౌమాధికారాన్ని కాపాడేలా పాక్‌ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాం’ అని సంయుక్త ప్రకటనలో చైనా తెలిపింది.

మరోవైపు పాకిస్తాన్‌ స్పందిస్తూ దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్‌)లో చైనా మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్‌ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ శనివారం ప్రకటించారు. ఎన్‌ఎస్‌జీలో చేరాలన్న భారత్‌ ప్రయత్నాలను చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. అమెరికా మద్దతు ఇస్తున్నప్పటికీ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ)పై ఇండియా సంతకం చేయకపోవడాన్ని సాకుగా చూపుతూ చైనా భారత్‌ చేరికను అడ్డుకుంటోంది.

మరిన్ని వార్తలు