మళ్లీ చైనా అడ్డుపుల్ల

14 Mar, 2019 04:39 IST|Sakshi

మసూద్‌ అజహర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం

ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుతగిలింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

గతంలోనూ భారత్‌ యత్నాలను చైనా అడ్డుకుంది. చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్‌ అంతకుముందే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు అజహర్‌ తగిన వ్యక్తేనని అమెరికా పేర్కొంది. తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు పలికిన అమెరికా, ఫ్రాన్స్, యూకేలకు కృతజ్ఞతలు తెలిపింది. 

మరిన్ని వార్తలు