అమెరికాపై డ్రాగన్‌ ఫైర్.. తైవాన్‌ కౌంటర్‌!

12 Jun, 2020 17:43 IST|Sakshi
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (ఫైల్‌ ఫొటో)

తైవాన్‌ గగనతలంలోకి అమెరికా మిలిటరీ విమానం

అగ్రరాజ్యం చర్యను ఖండించిన చైనా

మేం అనుమతినిచ్చామన్న తైవాన్‌ రక్షణ శాఖ

బీజింగ్‌/తైపీ: అమెరికా మిలిటరీ విమానం తైవాన్‌ గగనతలంలో ప్రవేశించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను అగ్రరాజ్యం ఉల్లంఘించిందని మండిపడింది. తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా.. కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనా తైవాన్‌ వ్యవహారాల కార్యాలయం.. ‘‘ఇది చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే చర్య. సార్వభౌమత్వం, భద్రత, హక్కులను ప్రమాదంలో పడేసింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు. దౌత్యపరమైన సంబంధాలను ప్రశ్నార్థకం చేశారు. ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’అని గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.(ఊచకోత; చైనా క్షమాపణ చెప్పాల్సిందే: తైవాన్‌)

కాగా తైవాన్‌ స్వతంత్ర పాలనకు మొగ్గుచూపినప్పటికీ డ్రాగన్‌ ఆ దేశాన్ని ఇంకా తమ భూభాగంగానే ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తైవాన్‌తో అమెరికా అధికారికంగా ఎటువంటి దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకోనప్పటికీ కఠిన సమయాల్లో ఆ దేశానికి అండగా నిలబడుతోంది. చైనా ఒత్తిడి మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి తైవాన్‌ను తొలగించారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆ దేశానికి మద్దతు ప్రకటించింది. అంతేగాక తైవాన్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కూడా ఉంది. ఇలా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సీ-40ఏ బోయింగ్‌ 737 (మిలిటరీ వర్షన్‌)ను తమ గగనతలంలో ప్రవేశించేందుకు తైవాన్‌ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. (బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా)

ఇక ఈ విషయంపై స్పందించిన అమెరికా మిలిటరీ వర్గాలు.. ‘‘సీ-40 జపాన్‌లోని కదెన ఎయిర్‌బేస్‌ నుంచి థాయిలాండ్‌కు వెళ్లే క్రమంలో ఈస్ట్‌కోస్ట్‌లో విన్యాసాలు జరుగుతున్నందున మార్గాన్ని మళ్లించి తైవాన్‌ నుంచి ప్రయాణించింది. తైవాన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల అనుమతితోనే గగనతలంలో ప్రవేశించింది. దాని కారణంగా ఎవరికి ఎటువంటి అంతరాయం కలుగలేదు’’అని వివరణ ఇచ్చింది. కాగా అదే రోజు చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించడాన్ని తైవాన్‌ అడ్డుకోవడం గమనార్హం. గగనతలంలో అక్రమంగా ప్రవేశించడంతో పాటు సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తైవాన్‌ డ్రాగన్‌పై విమర్శలు గుప్పించింది. (తైవాన్‌ విషం చిమ్ముతోంది: చైనా)

>
మరిన్ని వార్తలు