గల్వాన్‌ వ్యాలీ ఘటనపై అమెరికా ఇంటిలిజెన్స్‌ రిపోర్టు

14 Jul, 2020 11:47 IST|Sakshi

బీజింగ్‌: గల్వాన్‌ వ్యాలీ ఘటనపై చైనా ఇప్పటికి కూడా వాస్తవాలను వెల్లడించడం లేదు. ఈ క్రమంలో నాటి ఘర్షణలో మరణించిన సైనికులకు ప్రభుత్వ లాంఛనాలు కాదు కదా.. కనీసం సాంప్రదాయపద్దతిలో అంత్యక్రియలు కూడా నిర్వహించకూడదంటూ చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు అమెరికా ఇంటిలిజెన్స్‌ తెలిపింది. ఈ మేరకు సదరు సైనిక కుటుంబాలపై చైనా ఒత్తిడి తెచ్చినట్లు ఇంటిలిజెన్స్‌ వెల్లడించింది. గత నెల 15న గల్వాన్‌ వ్యాలీ ఘర్షణలో ఇరు దేశాలు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో అమరులైన భారత సైనిక వీరులకు యావత్‌ దేశప్రజలు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. కేంద్రం అమరులైన సైనికుల వివరాలు వెల్లడించడమే కాక వారికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇదే కాక జూన్‌ నెల మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సైనికులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. (గల్వాన్‌ దాడి; విస్తుగొలిపే నిజాలు!)

అయితే గల్వాన్‌ వ్యాలీ ఘర్షణ జరిగి నెలరోజులు కావస్తున్న‍ప్పటికి చైనా మాత్రం ఇంకా తన మరణించిన సైనికులు వివరాలు వెల్లడించలేదు. ఆ కుటుంబాలను ఓదార్చడం కాదు కదా కనీసం ధైర్యం కూడా చెప్పలేదని అమెరికా ఇంటిలిజెన్స్‌ అభిప్రాయపడింది. నాటి ఘర్షణలో సుమారు 35 చైనా సైనికులు మరణించినట్లు తెలిపింది. అయితే చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీరికి ఒక్కొక్కొరికి సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించకూడదని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాక.. అందరిని ఒకేసారి ఖననం చేయాల్సిందిగా ఆదేశించినట్లు అభిప్రాయపడింది. దీనిపై సదరు సైనికుల కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆదేశించినట్లు చైనా ప్రభుత్వం సమాధానమిచ్చినట్లు సమాచారం. (గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?)

 

మరిన్ని వార్తలు