చైనా మరో ఎత్తుగడ.. బంగ్లాదేశ్‌కు మరిన్ని ప్రయోజనాలు!

20 Jun, 2020 18:36 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటున్న చైనా

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా.. భారత్‌ మిత్ర దేశాలను పూర్తిగా తన వైపునకు తిప్పుకునేందుకు కుట్రలు పన్నుతోంది. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు సాయం ప్రకటిస్తూ ప్రేమ ఒలకబోస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌కు అన్ని విషయాల్లో అండగా ఉంటున్న డ్రాగన్‌.. నేపాల్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు చూస్తుంటే ఆ దేశాన్ని కూడా పూర్తిగా తన బుట్టలో వేసుకున్నట్లు కనిపిస్తోంది. భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలైన లిపులేఖ్‌, లింపియదుర, కాలాపానీలను తన భూభాగంలోకి కలుపుతూ నేపాల్‌ ప్రభుత్వం రూపొందించిన కొత్త మ్యాప్‌నకు ఇటీవలే రాజ్యాంగబద్ధత లభించిన విషయం తెలిసిందే. (72 గంటల్లోనే గల్వాన్‌‌ నదిపై బ్రిడ్జి నిర్మాణం)

ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి ఎన్నో ఏళ్లుగా సాయం పొందుతున్న నేపాల్‌ పాలకులు భారత్‌ను విమర్శిస్తూ కఠిన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో హాంకాంగ్‌లో చైనా ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి మద్దతు పలుకుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించినట్లయితే నేపాల్‌ చర్యల వెనుక డ్రాగన్‌ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవడం సహజమే. అంతేగాక భారత్‌ తమపై యుద్ధానికి సన్నద్ధమైతే పాకిస్తాన్‌, నేపాల్‌ నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని చైనా అధికార మీడియా కథనాలు ప్రచురించడం ద్వారా ఈ సందేహాలకు మరింత బలాన్ని చేకూర్చింది.(నేపాల్‌ మ్యాప్‌నకు రుజువులు లేవు: భారత్‌)

బంగ్లాదేశ్‌తో వాణిజ్య బంధం
ఇక తాజాగా భారత్‌ మరో మిత్ర దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆకట్టుకునేందుకు జిత్తులమారి చైనా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకునే క్రమంలో 5,161 వస్తువులపై టారిఫ్‌ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై హర్షం చేసిన బంగ్లాదేశ్‌.. ‘‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ మండలిలో భాగమైన టారిఫ్‌ కమిషన్‌.. బంగ్లాదేశ్‌ ఉత్పత్తుల(97 శాతం)పై జీరో టారిఫ్‌ అమలుకు అంగీకరిస్తూ జూన్‌ 16న నోటీసు విడుదల చేసింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఆసియా- పసిఫిక్‌ వాణిజ్య ఒప్పందం ప్రకారం చైనా ఇప్పటికే 3095 రకాల బంగ్లా ఉత్పత్తులపై సుంకం విధించకుండా ఆ దేశానికి ప్రయోజనం చేకూరుస్తోంది.(బయటపడ్డ చైనా కుట్ర.. తాజా ఫొటోలు!))

అంతగా పట్టించుకునే విషయం కాదు.. కానీ
కాగా భారత్‌- చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయ ప్రాంతంలో ఘర్షణ తలెత్తిన మరుసటి రోజు అనగా జూన్‌ 16న డ్రాగన్‌.. బంగ్లాకు ఈ ఆఫర్‌ ఇవ్వడం గమనార్హం. భారత సైనికుల మరణానికి కారణమైన చైనాకు బుద్ధి చెప్పేందుకు ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చైనా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌(అతిపెద్ద మార్కెట్‌)తో పోలిస్తే.. కేవలం పదహారున్నర కోట్ల(రమారమి) జనాభా కలిగిన బంగ్లాదేశ్‌తో డ్రాగన్‌ వాణిజ్యం సంబంధాలు మెరుగుపరచుకోవడం అంతగా పట్టించుకోవాల్సిన విషయమేమీ కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ సరిహద్దు దేశాలతో సఖ్యతగా మెలగడమనే డ్రాగన్‌ ఎత్తుగడలో ఈ చర్య భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గల్వాన్‌ లోయ ఘర్షణలో అమరులైన భారత జవాన్లకు అమెరికా, మాల్దీవులు(రక్షణపరంగా భారత్‌కు ఎంతో కీలకం), జర్మనీ, రష్యా నివాళులు అర్పించడం ద్వారా తాము భారత్‌ వైపేనని స్పష్టం చేశాయని పరిశీలకులు అంటున్నారు. (భారత్‌ను దెబ్బతీసేందుకు త్రిముఖ వ్యూహం)  

మరిన్ని వార్తలు