‘మిషన్‌ శక్తి’ గురించి చైనా ఏమన్నదంటే

27 Mar, 2019 20:42 IST|Sakshi

బీజింగ్ : ‘మిషన్‌ శక్తి’ పేరిట దేశ భద్రత కోసం అభివృద్ధి చేసిన యాంటీ శాంటిలైట్‌ క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. డీఆర్‌డీఓ, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని నరేంద్ రమోదీ బుధవారం ప్రకటించారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్‌ పట్ల చైనా ఆచితూచి స్పందించింది. ‘మిషన్ శక్తి’ ప్రయోగాన్ని స్వాగతించడం గానీ, వ్యతిరేకించడం గానీ చేయకుండా క్లుప్తంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అంతరిక్షంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రపంచదేశాలపై ఉందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రమే కాకుండా.. క్షిపణి ద్వారా ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని సాధించిన అన్ని దేశాలు కూడా అంతరిక్షంలో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఈ తరహా అంతరిక్ష, సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా, ఒకప్పటి సోవియట్ రష్యా, చైనాలు ఇప్పటికే ఉపగ్రహాలను పేల్చివేయగల సామర్థ్యం ఉన్న క్షిపణులను రూపొందించాయి. ఈ తరహా సాంకేతిక ప్రయోగాన్ని చైనా పన్నేండెళ్ల క్రితమే చేసింది. 2007, జనవరిలో చైనా అంతరిక్షంలో ఉన్న తన క్రియారహిత వాతావరణ ఉపగ్రహాన్ని యాంటి శాటిలైట్‌ క్షిపణి సాయంతో నాశనం చేసి విజయం సాధించింది.

మరిన్ని వార్తలు