కోవిడ్‌ పరిశోధనలే చైనా హ్యాకర్ల లక్ష్యం

22 Jul, 2020 04:38 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల అత్యంత విలువైన వాణిజ్య రహస్యాలను ఇద్దరు చైనా హ్యాకర్లు తస్కరించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. తాజాగా, ఈ హ్యాకర్లు కోవిడ్‌ టీకా కోసం పరిశోధనలు జరుపుతున్న అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. వ్యాక్సిన్‌ల అభివృద్ధి, చికిత్సలపై పరిశోధనలు జరుపుతున్న మసాచుసెట్స్, మేరీల్యాండ్‌లకు చెందిన ప్రముఖ సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో లోపాలపై పరిశోధన జరిపారని పేర్కొంది.

ఈ హ్యాకర్లపై వాణిజ్య రహస్యాల దొంగతనం, కుట్ర అభియోగాలు మోపుతున్నట్లు తెలిపింది. తస్కరణకు గురైన సమాచారం హ్యాకర్లే కాకుండా చైనా ప్రభుత్వానికి కూడా ఎంతో విలువైందని వివరించింది. చైనా ప్రభుత్వం పరోక్షంగా నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. హ్యాకర్లు ఎలాంటి సమాచారాన్ని దొంగతనంగా గ్రహించారనే విషయం అమెరికా అధికారులు వెల్లడించలేదు. విదేశీ హ్యాకర్లపై అమెరికా ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం. 

రష్యా గూఢచర్యంపై యూకే టార్గెట్‌ 
రష్యా గూఢచార కార్యకలాపాలపై దృష్టిసారించాలని బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. అవాంఛనీయ, తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదమున్న నేపథ్యంలో రష్యాని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటిష్‌ పార్లమెంటరీ కమిటీ విడుదల చేసిన 50 పేజీల రిపోర్టులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు