చైనా పురోగమనాన్ని ఏ శక్తీ ఆపలేదు

2 Oct, 2019 04:14 IST|Sakshi

70వ వార్షికోత్సవ పరేడ్‌లో జిన్‌పింగ్‌

బీజింగ్‌: చైనా పురోగమనాన్ని ఏ శక్తీ ఆపజాలదని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీ పాలనాపగ్గాలు చేపట్టి 70 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పరేడ్‌నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘చైనా స్థాయిని, చైనా ప్రజలు, జాతి పురోగతిని ఏ శక్తీ అడ్డుకోజాలదు. ప్రజల తరఫున పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాను స్థాపిస్తున్నట్లు 70 ఏళ్ల క్రితం మావో ప్రకటించారు. అప్పటి వరకు ఉన్న దయనీయ పరిస్థితుల నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో దేశం పూర్తిగా మారిపోయింది’అని జిన్‌పింగ్‌ తన ప్రసంగంలో అన్నారు.

‘ఈ పురోగమనంలో శాంతియుత పునరేకీకరణ, ఒకే దేశం– రెండు వ్యవస్థలు, హాంకాంగ్, మకావోల సుసంపన్నం, స్థిరత్వం కొనసాగుతాయి’అని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పరేడ్‌లో క్షిపణి బ్రిగేడ్‌తోపాటు ఖండాంతర క్షిపణులు, చైనా మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ లియోనింగ్‌పై మోహరించిన జె–15 పోరాట విమానాలు, సూపర్‌సోనిక్‌ సీజే–100 క్షిపణులు, 99 ఏ రకం యుద్ధ ట్యాంకులు, ఆధునిక డ్రోన్లు తదితర 300 కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది. పరేడ్‌ మైదానంలో మావో, జింటావో, జిన్‌పింగ్‌ల భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు