చైనా ఆర్మీకి అదే పెద్ద తలనొప్పి

26 Aug, 2017 20:42 IST|Sakshi
చైనా ఆర్మీకి అదే పెద్ద తలనొప్పి
షాంఘై: చైనా సైన్యం ఇప్పుడు తెగ ఆందోళన చెందుతోంది. కొత్తగా ఆర్మీలో చేరేందుకు వస్తున్న వారిలో ఎక్కువ శాతం తిరస్కరణకు గురికావటం అందుకు కారణం. తద్వారా కమ్యూనిస్ట్ దేశానికి బలమైన సైన్యాన్ని సమకూర్చుకోవాలన్న దేశాధ్యక్షుడు జింగ్ పింగ్ కోరికకు గండిపడుతోంది. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. 
 
అతి స్వయం సంతృప్తి మూలంగా శారీర పరీక్షల్లో విఫలమవుతుండటంతో నియామక ప్రక్రియ మొదటి రౌండ్‌లోనే అభ్యర్థులు వెనుదిరుగుతున్నారని తాజాగా పీఎల్‌ఏ డెయిలీ అనే ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. వీటితోపాటు డ్రాగన్‌ కంట్రీ ఆర్మీలో కొత్త చేరికలు లేకపోవటానికి మరో పది కారణాలు కూడా ఉన్నాయంటూ తెలిపింది. అతిబరువు కారణంగా 20 శాతం మంది,  రాత్రిళ్లు ఫోన్‌లలో గడపటం, ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడకం, స్వయం సంతృప్తి చేష్టల మూలంగా 8 శాతం, ఫిట్ నెస్‌ లేకపోవటం,  వీడియో గేమ్‌లు ఎక్కువగా ఆడటం, ఒంటిపై టాటాలు, అతిగా మద్యం సేవించి లివర్‌ పాడయిపోవటం వంటి కారణాలు వారి చేరికలకు ఆటంకాలుగా మారుతున్నాయని పేర్కొంది. 
  
ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం చైనాది. ఇందులో చేరాలంటే చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. చాలా ధృఢంగా ఉండాలి. ఏ ఒక్క పరీక్షలో పాస్‌ కాకపోయినా వాళ్లకు అవకాశం దక్కదు అంటూ రక్షణ మంత్రి  ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆధునిక జీవన శైలే ఇప్పటి యువత అనారోగ్యులుగా, సోమరులుగా మారుస్తుందని సైన్యం కూడా ఈ మధ్య విమర్శలు చేస్తూ వస్తోంది. ఇక ఆ మధ్య కింగ్ ఆఫ్‌ గ్లోరీ అనే వీడియో గేమ్ మూలంగా అత్యవసర సమయాల్లోనూ సైనికులు గతి తప్పిన ఘటనలు వెలుగులోకి తెస్తూ ఇదే పత్రిక కథనం వెలువరించింది కూడా. 
>
మరిన్ని వార్తలు