హాంకాంగ్‌ అల్లర్ల వెనుక 'ప్రజాస్వామ్యం'

19 Aug, 2019 17:03 IST|Sakshi

హాంకాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనకారులకు వ్యతిరేకంగా చైనా మీడియాలో ఓ వీడియో హోరెత్తుతోంది. నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనకారులు గతకొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఈ ఆందోళనలను హేళన చేస్తూ.. ప్రొ డెమొక్రసీ సభ్యులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ.. ‘సీడీ రేవ్’ అనే బ్యాండ్‌ రూపొందించిన ర్యాప్ వీడియో ఇప్పుడు చైనాలో వైరల్‌గా మారింది. 'హే డెమోక్రసీ!' అంటూ సాగే ఈ వీడియోలో మిలియన్ల మంది హాంకాంగ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి.. చైనా పాలనను వ్యతిరేకించడాన్ని చూపిస్తూ.. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, వారు విదేశీ ఏజెంట్లుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించింది. నిబంధనలకు విరుద్ధంగా హాంకాంగ్ అసెంబ్లీలోకి నిరసనకారులు చొరబడ్డారని చైనా దేశభక్త ర్యాప్‌ గ్రూప్‌ అయిన ‘సీడీ రేవ్‌’ ఈ వీడియోలో పేర్కొంది. హాంకాంగ్ చైనాలో భాగమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో జోడించింది.

హాంకాంగ్‌ నిరసనకారులపై చైనా ప్రయోగించిన ఈ వీడియో ఆ దేశ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బ్రిటన్ జూలై 1, 1997 అర్ధరాత్రి హాంకాంగ్‌లో పాలనను ముగించి హాంకాంగ్‌పై సార్వభౌమాధికారం, భూభాగంపై నియంత్రణను చైనాకు ఇచ్చింది. నేడు ఇదే సాధారణంగా  'హాంకాంగ్‌ అప్పగింత'గా పిలువబడుతుంది. అప్పగించినప్పటి నుంచి హాంకాంగ్‌ సెమీ అటానమస్ సిటీగా (పాక్షికంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు)   మారింది.

>
మరిన్ని వార్తలు