చర్చలకు సిద్ధం.. మా తప్పు లేదు: చైనా

18 Jun, 2020 19:36 IST|Sakshi

తమ ఆర్మీని వెనకేసుకొచ్చిన జావో లిజియాన్‌

బీజింగ్‌: భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో గురువారం తెలిపారు. కమాండర్‌ స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని.. త్వరలోనే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం, సుస్థిరత నెలకొనే దిశగా ఇరు దేశాలు నిజాయితీగా కృషి​ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక గాల్వన్‌ లోయ ఘర్షణలకు భారత సైనికులనే బాధ్యులను చేస్తూ అసత్య ప్రచారాలకు దిగిన డ్రాగన్‌.. తాజాగా మరోసారి అదే పంథాను అనుసరించింది. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జావో సమాధానం ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం.(సుదీర్ఘంగా సాగిన ఇండో-చైనా సైనికాధికారుల భేటీ)

‘‘సినో- ఇండియన్‌ బార్డర్‌లోని గాల్వన్‌ నదిపై చైనా డ్యామ్‌ నిర్మిస్తుందా? దానిని అడ్డుకునేందుకు భారత బలగాలు ప్రయత్నించినందు వల్లే తాజా ఘర్షణ చోటుచేసుకుందా’’ అని విలేకరులు ప్రశ్నించగా.. డ్యామ్‌ విషయం గురించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే ఘర్షణలకు మాత్రం భారత ఆర్మీ ప్రవర్తనే కారణమంటూ మరోసారి విషం చిమ్మారు. చైనా సైనికుల తప్పేమీ లేదంటూ సమర్థించుకున్నారు. అదే విధంగా సోమవారం నాటి ఘటనలో ఎంత మంది చైనా సైనికులు మరణించారన్న ప్రశ్నలకు కూడా జావో సమాధానం దాటవేశారు. కాగా ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం విదితమే. (గల్వాన్‌ లోయ భారత్‌దే: అమీన్‌ గల్వాన్‌)

మరిన్ని వార్తలు