సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!

8 Jun, 2020 12:23 IST|Sakshi

న్యూఢిల్లీ: లదాఖ్‌ ప్రతిష్టంభన చర్చల ద్వారా తొలగిపోతుందని భారత్‌ చెప్తున్న క్రమంలో.. చైనా కవ్వింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్‌ లిబరేషర్‌ ఆర్మీకి చెందిన  వేలాది పారా ట్రూపర్లు ఆ దేశ వాయువ్య సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కవాతు‌ నిర్వహించినట్టు గ్లోబల్‌ టైమ్స్‌ మీడియా తన కథనంలో వెల్లడించింది. వాయువ్య సరిహద్దుల్లో చైనా భారీ స్థాయిలో సైనిక, రక్షణ సామాగ్రిని తరలిస్తోందని, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకే ట్రూపర్లతో డ్రిల్‌ జరిగిందని తెలిపింది. 

దానికి సంబంధించి వీడియోను సైతం విడుదల చేసింది. హుబెయి నుంచి ఆ ప్రాంతానికి కొద్దిగంటల్లోనే బలగాలు చేరుకున్నాయని, అవసరమైనప్పుడు వేగంగా బలగాలను చేరవేయగలమని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన చర్చల ద్వారా పరిష్కారమవుతుందని భారత్ చెప్పిన మరునాడే ఈ వార్త వెలువడటం గమనార్హం. అయితే, భారత్‌ను మానసికంగా దెబ్బకొట్టేందుకే చైనా ఈ చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
(చదవండి: చైనాతో శాంతియుత పరిష్కారం)

శత్రుదేశ బలగాల సన్నద్ధత, సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తేలా చేయడం.. సరిహద్దు ఉద్రిక్తతల గురించి చిలువలు పలువలుగా అధికార మీడియాలో కథనాలు ప్రచురించడం ఎత్తుగడలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచం దృష్టిని మరల్చేందుకు డ్రాగన్‌ ఇలాంటి చర్యలకు పూనుకుందని మరికొంత మంది వాదిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలు, మ్యాపులు సోషల్‌ మీడియాలో విడుదల చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య శనివారం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ హాజరయ్యారు. చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజర్‌ జనరల్‌ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు.

మరిన్ని వార్తలు