ఇంటర్నెట్ గేమింగ్పై చైనా నిషేధం

8 Oct, 2016 18:08 IST|Sakshi
ఇంటర్నెట్ గేమింగ్పై చైనా నిషేధం
బీజింగ్ : ఇంటర్నెట్ వాడకంపై చైనా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదేపనిగా వీడియో గేమ్ లు ఆడుతూ గేమింగ్ సెంటర్లకే పరిమితమవుతున్న పిల్లలను కట్టడిచేసేందుకు చైనా సమాయత్తమైంది. 18 ఏళ్లలోపువారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటర్నెట్ గేమింగ్ సెంటర్లను వినియోగించడంపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఇటీవల కాలంలో చైనాలో అధికశాతం బాలబాలికలు ఇంటర్నెట్ గేమింగ్ కు బానిసలుగా మారడం ఎక్కువైంది. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇంటర్నెట్ గేమింగ్ సెంటర్లకే పరిమితమవుతున్నారు. ఈ సమస్య అంతకంతకూ పెరుగుతుండటంతో చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
చైనాలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో పదేళ్ల నుంచి 39 ఏళ్ల లోపు ఉన్నవారు 74 శాతం మంది ఉండగా, పదేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్నవారు 20 శాతం మంది ఉన్నారు. దీంతో చిన్నారులు ఇంటర్నెట్ గేమింగ్ కు బానిసలు కాకుండా నిరోధించేందుకు చైనా సైబర్ స్పేస్ యంత్రాంగం  చర్యలను తీసుకోనుంది. గేమింగ్ కు బానిసలుగా మారిన పిల్లలను అందులో నుంచి బయటకు తీసుకురావడానికి వీలుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

అంతేకాకుండా అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు ఇంటర్నెట్ గేమింగ్ పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు తెలిపింది. దీంతోపాటు గేమింగ్ పై గంటల తరబడి ఉండకుండా నిరోధించేందుకు నిర్ణీత సమయాన్ని నిర్దేశించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. గేమ్ ఆడాలనుకునే చిన్నారులు తొలుత తమ చైనా గుర్తింపు కార్డుతో నమోదు చేసుకుని ఆట ప్రారంభించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఆ గేమ్ దానంతట అదే ఆగిపోతుంది. ఈ నిర్ణయాలపై ఈ నెలాఖరులోగా అభిప్రాయాలు చెప్పాలని చైనా ప్రభుత్వం ప్రజలను కోరింది. అయితే దీనిపై ఎక్కువమంది ఇంటర్నెట్ వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
మరిన్ని వార్తలు