నిఘా కోసం చైనా డ్రోన్లు

2 Jul, 2019 04:21 IST|Sakshi

బాలాకోట్‌ దెబ్బతో వ్యూహం మార్చిన పాక్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేయడంతో పాకిస్తాన్‌కు రక్షణ పరంగా తన వైఫల్యాలేమిటో తెలిసి వచ్చింది. దాంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. భారత్‌ విషయంలో ఇంత వరకు అనుసరిస్తున్న వ్యూహాలను మార్చుకుంటోంది. సైనిక స్థావరాల వద్ద భద్రతను పటిష్టం చేయడం, సరిహద్దులో నిఘాను పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి.


ఏ మాత్రం దొరక్కుండా, రాడార్లకు కూడా చిక్కకుండా భారత్‌ దాడి చేయడం, ఆ తర్వాత భారత్‌పై దాడికి చేసిన యత్నం విఫలమవడాన్ని పాక్‌ సైన్యం జీర్ణించుకోలేకపోతోందని భారత నిఘావర్గాల భోగట్టా. అత్యాధునిక ఆయుధాలు, నిఘా వ్యవస్థలను సత్వరమే సమకూర్చుకోవాలని, సరిహద్దులో నిఘాను పెంచాలని నిర్ణయించింది. వాస్తవాధీన రేఖ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లలో నిఘాకోసం మరిన్ని డ్రోన్‌లను ఉపయోగించాలని, వాటిని చైనా నుంచి కొనాలని నిర్ణయించింది. అలాగే, సరిహద్దులో చైనా తయారీ మధ్యంతర క్షిపణులను మోహరించాలని కూడా ఆలోచిస్తోంది.

అత్యాధునిక రైన్‌బో డ్రోన్‌లు, యూఏవీల కొనుగోలుకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  మరోవైపు ఉగ్ర సంస్థలకు కూడా జాగ్రత్తలు చెబుతోంది. ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించవద్దని, వాస్తవాధీన రేఖకు దూరంగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలని  సూచించినట్టు నిఘా వర్గాల సమాచారం. అలాగే, ఉగ్రవాదులంతా పాక్‌ సైనిక యూనిఫాంలు  లేకుండా బయట తిరగవద్దని కూడా స్పష్టం చేసింది.  భారత్‌పై దాడుల కోసం ఉగ్రవాదుల కన్సార్టియం ఏర్పాటుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని తెలిసింది. ఇందుకోసం జైషే, హఖానీ, తాలిబన్, ఐసిస్‌ వంటి ఉగ్ర సంస్థల మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. 

మరిన్ని వార్తలు