వూహాన్‌లో ఆరు కొత్త కరోనా కేసులు

12 May, 2020 02:16 IST|Sakshi

స్ట్రీట్‌ వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి సస్పెండ్‌

బీజింగ్‌/వాషింగ్టన్‌: ప్రాణాంతక మహమ్మారి కరోనా పుట్టినిల్లు వూహాన్‌లో సుమారు నెల రోజుల స్తబ్దత తర్వాత ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. వూహాన్‌లోని సాన్‌మిన్‌ నివాస సముదాయంలో ఈ కొత్త కేసులు నమోదు కాగా.... అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్‌ చేసింది. ఛాన్‌గోయింగ్‌ స్ట్రీట్‌ వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి  ఝాంగ్‌ యుక్సిన్‌ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్‌ చేసినట్లు షిన్‌హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. కొత్తగా బయటపడ్డ కేసులన్నీ ఈ ఛాంగ్‌గోయింగ్‌ వీధిలోనివే. మరోవైపు, చైనాలోని అన్ని ప్రాంతాల్లోనూ వైరస్‌ ప్రభావం తగ్గిందనేందుకు సూచనగా ప్రభుత్వం కోవిడ్‌ రిస్క్‌ ప్రమాద హెచ్చరికను తగ్గించింది. వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ప్రఖ్యాత షాంఘై డిస్నీల్యాండ్‌ మళ్లీ మొదలైంది.

మైక్‌ పెన్స్‌ స్వీయ నిర్బంధం
తన సహాయకుడు ఒకరు కరోనాబారిన పడటంతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా పరీక్షల్లో పెన్స్‌కు ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. సెంటర్స్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్, ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ స్టీఫెన్‌ హాన్‌ సైతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు