భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నాం: చైనా

28 Apr, 2020 11:08 IST|Sakshi

ఆ కిట్లు వాడొద్దన్న ఐసీఎంఆర్‌

ఒక్కరూపాయి చెల్లింబోమన్న సర్కారు

తాజా పరిణామాలపై స్పందించిన చైనా

న్యూఢిల్లీ: తమ దేశానికి చెందిన కంపెనీల కరోనా రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను వాడొద్దన్న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచనలపై చైనా స్పందించింది. వైద్య పరికరాల నాణ్యత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల పనితీరుపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఐసీఎంఆర్‌తో చైనా రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. ఈ క్రమంలో త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి.. తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఆ రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు చైనా రాయబారి జీ రోంగ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. (అదే ఆమె ప్రాణాలు తీసింది: ఓ తండ్రి భావోద్వేగం)

కాగా గువాంగ్‌జో వండ్ఫో బయోటెక్‌, జుహాయ్‌ లివ్సోన్‌ డయాగ్నస్టిక్స్‌ అనే రెండు చైనా కంపెనీలకు చెందిన రాపిడ్‌ టెస్టింటు కిట్లు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు ఇవ్వడం లేదని ఐసీఎంఆర్‌ సోమవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెండు కంపెనీల నుంచి కిట్లు కొనవద్దని, ఒకవేళ ఇప్పటికే వాటిని ఉపయోగిస్తున్నట్లయితే వాడకం ఆపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో సదరు కంపెనీలకు ఇంతవరకు చెల్లింపులు జరుపలేదని.. ఇకపై ఒక్క పైసా కూడా చెల్లించబోమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ విషయంపై స్పందించిన జీ రోంగ్‌... ఆ రెండు కంపెనీల టెస్టింగ్‌ కిట్లకు చైనా జాతీయ వైద్య ఉత్పత్తుల పాలనావిభాగం(ఎన్‌ఎంపీఏ) నుంచి సర్టిఫికేషన్‌ లభించిందని పేర్కొన్నారు.(చైనాపై సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌ : ట్రంప్‌)

అదే విధంగా భారత్‌లోని పుణెలో గల జాతీయ వైరాలజీ సంస్థ వీటిని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. రాపిట్‌ టెస్టింగ్‌ కిట్ల స్టోరేజీ, రవాణా, వాడకంలో జాగ్రత్తలు పాటించకపోయినట్లయితే అది కిట్‌ పనితీరుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది చైనా ఉత్పత్తులు నాసిరకానికి చెందినవని కొంతమంది అనుచిత, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చైనా గుడ్‌విల్‌, సిన్సియారిటీని భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నాం. వాస్తవాలను గమనించి చైనా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉంది. వైరస్‌లు మానవాళి ఉమ్మడి శత్రువులు. మనమంతా ఒక్కటిగా పోరాడితేనే కోవిడ్‌-19పై విజయం సాధించగలం. ఈ పోరులో బారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. సమస్యలు అధిగమించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారికి తోడుగా నిలుస్తాం’’అని జీ రోంగ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు