అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోం: చైనా

30 Apr, 2020 16:40 IST|Sakshi

ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న ట్రంప్‌

బీజింగ్‌/వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఆసక్తి తమకు లేదని చైనా పేర్కొంది. ఒక దేశ అంతర్గత వ‍్యవహారాల్లో తలదూర్చే అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. కరోనా(కోవిడ్‌-19) వ్యాప్తి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొద్దికాలంగా డ్రాగన్‌ దేశంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్‌ వల్ల అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు భారీగా నష్టపోయాయని.. ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేగాక కరోనా పుట్టుకపై లోతైన విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా వైరస్‌ తీవ్రతను చెప్పకుండా నిజాలు దాచి చైనాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు నిలిపివేశారు. (డబ్ల్యూహెచ్‌ఓ చైనా పైప్‌ ఆర్గాన్‌ వంటిది: ట్రంప్‌)

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని  ట్రంప్‌ నిర్ణయించుకున్నట్లు శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆరిజోనా ప్రాంతంలో పర్యటించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో బుధవారం రాయిటర్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్‌.. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య, ఇతర ప్రయోజనాల కోసం డ్రాగన్‌ దేశం డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు సాయం చేసే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నానన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా అధినాయకత్వమే కారణమని.. వాళ్ల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయని మండిపడ్డారు.(కరోనా వేళ ట్రంప్‌ ఊహించని నిర్ణయం)

ఇక ఈ విషయంపై గురువారం స్పందించిన చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గెంగ్‌ షాంగ్‌ మాట్లాడుతూ.. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా ఆ దేశ అంతర్గత అంశం. అమెరికా ప్రజలు మమ్మల్ని అందులోకి లాగరని ఆశిస్తున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి వైరస్‌ మాత్రమే వారి శత్రువు. చైనా కాదు’’అని చురకలు అంటించారు.  

>
మరిన్ని వార్తలు