సరిహద్దు వద్ద ఉద్రిక్తత: భారత్‌కు చైనా విజ్ఞప్తి

13 May, 2020 20:46 IST|Sakshi

మా భూభాగం వెంబడి దళాలు సాధారణ పెట్రోలింగ్‌ చేస్తున్నాయి.

బీజింగ్‌: భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజాన్‌ బుధవారం స్పందించారు. సరిహద్దు వద్ద తమ సైన్యం ఎంతో సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తన విధులను సమర్థవంతగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత సంక్లిష్టయ్యేలా భారత్‌ ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది ఘర్షణకు దిగడంతో పాటు.. పరస్పరం రాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఒకానొక సమయంలో ఉద్రిక్తతలు శిఖరస్థాయికి చేరుకోవడంతో ఇరు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. (ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత)

ఇక మహమ్మారి కరోనా వైరస్‌ మూలాలపై ప్రపంచ దేశాలు చైనాపై సందేహాలు వ్యక్తం చేస్తుండటంతో పాటుగా.. పలు బహుళజాతి కంపెనీలు బీజింగ్‌ నుంచి భారత్‌కు తమ కార్యకలాపాలను తరలించాలని యోచిస్తుండటంతో చైనాపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ దేశాన్ని చుట్టుముడుతున్న ఒత్తిళ్లతోనే ఆ దేశ ఆర్మీ అసహనంతో దుందుడుకు చర్యలకు పాల్పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘సరిహద్దు వద్ద మా వైఖరి ఎంతో స్పష్టంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాలు శాంతియుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి భారత్‌ ఈ విషయంలో సంయమనంగా వ్యవహరించాలి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణిగేలా ద్వైపాక్షిక చర్చలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పరిస్థితిని సంక్లిష్టంగా మారితే శాంతి, సుస్థిరతకు విఘాతం కలుగుతుంది’’అని వ్యాఖ్యానించారు. (ఒత్తిళ్లతో చైనా అసహనం)

మరిన్ని వార్తలు