తైవాన్‌ విషం చిమ్ముతోంది: చైనా

10 Apr, 2020 17:25 IST|Sakshi

బీజింగ్‌/తైపీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)పై తైవాన్‌ ఉద్దేశపూర్వకంగానే విషం చిమ్ముతోందని చైనా ఆరోపించింది. మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)విజృంభిస్తున్న తరుణంలో స్వాతంత్ర్యం పొందేందుకు జాతి విద్వేష చర్యలను రెచ్చగొడుతోందని మండిపడింది. తనను జాత్యహంకారిగా చిత్రీకరిస్తూ ప్రచారమవుతున్న అసత్యాలు తైవాన్‌లో పురుడు పోసుకుంటున్నాయని.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చైనా తైవాన్‌పై ఈ విధమైన ఆరోపణలు చేసింది. కాగా తైవాన్‌ తనను తాను స్వతంత్ర దేశంగా చెప్పుకొన్నప్పటికీ చైనా మాత్రం ఆ ప్రాంతం తమ ఆధీనంలోనే ఉందని వాదిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ సభ్యత్వ దేశాల నుంచి తైవాన్‌ను తొలగించారు. చైనా ఒత్తిడితోనే అంతర్జాతీయ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తైవాన్‌ ఆరోపించింది. అదే విధంగా.. చైనా మాటలకు తలొగ్గి డబ్ల్యూహెచ్‌ఓ తమను వెలివేసిందని మండిపడింది. ప్రస్తుతం విశ్వమారి కరోనా విస్తరిస్తున్న తరుణంలో తమకు సరైన సమాచారం అందకపోవడం వల్ల ఎంతో మంది పౌరుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాకుండా చైనాతో కలిపి తమ దేశపు కరోనా కేసుల సంఖ్యను డబ్ల్యూహెచ్‌ఓ ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. డబ్ల్యూహెచ్‌ఓ చైనాకు మద్దతుగా నిలుస్తోందని మండిపడింది. వైరస్‌కు సరిహద్దులు ఉండవని అది ఎక్కడైనా విస్తరిస్తుంది కాబట్టి అందరినీ అప్రమత్తం చేయాలని హితవు పలికింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌పై ఇంటర్నెట్‌లో ట్రోలింగ్‌ జరిగింది.(ట్రంప్‌ హెచ్చరికలు.. డబ్ల్యూహెచ్‌ఓ స్పందన)

ఇక ఈ విషయంపై స్పందించిన చైనా తైవాన్‌ వ్యవహారాల కమిటీ గురువారం తైవాన్‌ అధికార పార్టీ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ నీతి నియమాలు లేని డీపీపీ అధికారులు స్వాతంత్ర్యం కోసం వైరస్‌ను వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతున్నారు. కుట్రపూరితంగానే గ్రీన్‌ ఇంటర్‌నెట్‌(డీపీపీ పార్టీ రంగును ఉద్దేశించి) జాతి విద్వేషాలు రెచ్చగొడుతోంది. మేం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని పేర్కొంది. 

ఇందుకు బదులిచ్చిన తైవాన్‌ న్యాయ శాఖ శుక్రవారం.. ట్విటర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ గురించి చెడుగా ప్రచారం చేస్తోంది చైనా ప్రజలేనని ఎదురుదాడికి దిగింది. తాము చేయని తప్పునకు టెడ్రోస్‌ను క్షమాపణలు అడిగితే అంతర్జాతీయ సమాజంలో తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని గట్టిగానే సమాధానమిచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని చైనానే తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని... సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాల్పడేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.(డబ్ల్యూహెచ్‌ఓను హెచ్చరించిన ట్రంప్‌!)

కాగా కరోనా గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా ప్రోద్భలంతో సంస్థ చీఫ్‌గా ఎన్నికైన టెడ్రోస్‌ ఇప్పుడు ఆ దేశానికి మద్దతుగా నిలుస్తూ రుణం తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తైవాన్‌పై చైనా మండిపడగా.. మరోసారి #ThisAttackComesFromTaiwan అనే హ్యాష్‌ట్యాగ్‌తో తైవాన్‌ గొప్పతనాన్ని చాటుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అధ్యక్షురాలు సా యింగ్‌-వెన్‌ నేతృత్వంలోని తైవాన్‌ ప్రభుత్వం స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశమని.. అభ్యుదయ భావాలతో ముందుకు సాగుతోందని పేర్కొంటున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా