సీరియల్‌ కిల్లర్‌కు ఉరిశిక్ష

30 Mar, 2018 17:02 IST|Sakshi

బీజింగ్‌ : తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టించడానికి. చైనాకు చెందిన సీరియల్‌ కిల్లర్‌ గావో చింగ్‌యాంగ్‌ విషయంలోనూ అదే జరిగింది. నేరాలు చేసి మారువేషాల్లో తిరిగే గావోతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా నేర ప్రవృత్తి కలవారే. ఒక హత్య కేసులో అరెస్టయిన  గావో రక్తసంబంధీకుడి డీఎన్‌ఏ ఈ సీరియల్‌ కిల్లర్‌ను పట్టించింది. దీంతో 28 ఏళ్లుగా పోలీసులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. అత్యంత పాశవికంగా 11 మంది మహిళలను హత్య చేసిన ఈ సీరియల్‌ కిల్లర్‌కు బేయిన్‌ సిటీ కోర్టు మరణశిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడిన గావోకు మరణశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టు పేర్కొంది. సమాజానికి హానికారకంగా తయారైన ఇటువంటి వ్యక్తికి మళ్లీ అప్పీలుకు వెళ్లే అర్హత కూడా లేదంటూ వ్యాఖ్యానించింది.

చైనా రిప్పర్‌.. గావో
చైనా జాక్‌ ద రిప్పర్‌గా పేరొందిన గావో చింగ్‌యాంగ్‌కు మహిళలంటే ద్వేషం. ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలను వెంబండించి, వారి గొంతు కోసేవాడు. తర్వాత శవాలను ముక్కలు ముక్కలు చేసి రాక్షసానందం పొందేవాడు. 1988- 2002 మధ్య కాలంలో 11 మంది మహిళలను ఇదేరీతిలో హత్య చేశాడు. బాధితుల్లో  ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది.  పోలీసులకు చిక్కకుండా గావో  సుమారు మూడు దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగాడు. అతని కోసం గాలించి విసుగు చెందిన పోలీసులు.. అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల యువాన్ల రివార్డు కూడా ప్రకటించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఇక వైట్‌ చాపెల్‌ మర్డరర్‌గా ప్రసిద్ధి చెందిన లండన్‌కు చెందిన జాక్‌ రిప్పర్‌ సీరియల్‌ కిల్లర్‌. ఇతడిపై ఐదుగురు మహిళలను హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపితం కాలేదు.

మరిన్ని వార్తలు