కశ్మీర్ పై పాక్ కు చైనా ఝలక్!

23 Sep, 2017 15:29 IST|Sakshi

బీజింగ్:
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలన్న దాయాది పాకిస్థాన్ కుయుక్తుల్లో పాలుపంచుకోవడానికి చైనా నిరాకరించింది. కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ వివాదాన్ని భారత్-పాకిస్థాన్ లే ఉమ్మడిగా మాత్రమే పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. కశ్మీర్ ను అంతర్జాతీయ వివాదంగా చూపి.. భారత్ ను దెబ్బతీయాలని భావిస్తున్న పాకిస్థాన్ కు ఇది ఎదురుదెబ్బే. కశ్మీర్ విషయంలో ఇప్పటికే ఆర్గనేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) మద్దతు పొందిన పాక్.. తనను అన్నికాలల్లోనూ 'మిత్రదేశం'గా అభివర్ణించే చైనా నుంచి కూడా మద్దతు పొందాలని భావించింది. కానీ చైనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించడం గమనార్హం.

'కశ్మీర్ విషయంలో చైనా వైఖరి సుస్పష్టం. చాలాకాలం నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. భారత్-పాక్ చర్చలు, పరస్పర సమాచారాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఈ వివాదాన్ని సరిగ్గా పరిష్కరించుకుంటాయని, ఉమ్మడిగా శాంతి, సుస్థిరతకు పాటుపడుతాయని చైనా ఆశిస్తోంది' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కంగ్ తెలిపారు. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలన్న పాక్ డిమాండ్ కు ఓఐసీ మద్దతు తెలుపడంపై స్పందించాలని కోరగా.. లు కాంగ్ ఈ మేరకు స్పందించారు. ఈ ప్రకటన ద్వార  కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని చైనా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. పాక్ కోసం భారత్ లో తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టలేమని కూడా చైనా చెప్పినట్టు అయింది. ఇటీవల ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించిన పాక్ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసి కశ్మీర్ కోసం ఐరాస ప్రత్యేక దూతను నియమించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ భారత్.. దాయాది పాకిస్థాన్ కాదు టెర్రరిస్తాన్ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

మరిన్ని వార్తలు