సజీవ సమాధుల్లోంచి చిన్నారుల ఘోష

13 May, 2018 10:02 IST|Sakshi
భూకంపం తర్వాత రోదిస్తున్న చిన్నారుల తల్లులు

బెర్లిన్‌: సుమారు 90 వేలకు పైగా పౌరులు. వారిలో 7 వేల మంది స్కూల్‌ చిన్నారులు. భారీ భూకంపం దాటికి సజీవ సమాధి అయ్యారు. అయితే నాణ్యత లేమి కారణంగానే స్కూల్‌ భవనాల కారణంగా ఆరోపణలు. పదేళ్లైనా మృతుల జాబితాను ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదు?  మరోవైపు తమ పిల్లలు బతికే ఉన్నారా? అన్న ఆశలో తల్లిదండ్రులు. వెరసి దశాబ్ద కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో...

చైనాలోని సిచువాన్‌ ప్రొవిన్స్‌లో మే12, 2008న రిక్చర్‌ స్కేల్‌పై 7.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనాల దాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా.. 70 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది ఇప్పటిదాకా ఆచూకీ తెలియకుండా పోయారు. పెద్ద సంఖ్యలో స్కూల్‌ భవనాలు కుప్పకూలిపోవటంతో సుమారు 7 వేల మంది చిన్నారులు సజీవ సమాధి అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శరీరాలు భవనాల కిందే ఛిద్రం అయిపోగా తల్లిదండ్రుల శోకం వర్ణనాతీతంగా మారింది. అయితే మృతుల సంఖ్య ఎక్కువే ఉండొచ్చు అని సామాజిక వేత్త ‘అయి వెయివెయి’ చెబుతున్నారు. భూకంపం తర్వాత సహయక చర్యల్లో పాల్గొన్న ఆయన.. నాటి పరిస్థితిపై ఓ నివేదిక రూపొందించారు. 

వెయివెయి నివేదిక ప్రకారం... ‘కనీస ప్రామాణికాలు లేకుండా భవనాలను నిర్మించారు. ఫలితం 7 వేల మంది చిన్నారులు బలయ్యారు. భద్రత ప్రమాణాలు లేని స్కూళ్లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది? ఆ మరుసటి ఏడాది సంభవించిన భూకంపాల్లో మరో 5 వేల మంది విద్యార్థులు చనిపోయారని ప్రభుత్వం అంటోంది. మరి మృతుల పేర్ల జాబితాను పదేళ్లు గడిచినా ఎందుకు విడుదల చేయలేదు. ఈ విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రావట్లేదు. చారిత్రక ఘటనకు సంబంధించిన నిజాలను ఈ కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం బయటకు రానీవ్వట్లేదు. పోరాటంలో తల్లిదండ్రులు అలసిపోయారు. విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో నాపై పోలీసులు దాడి చేశారు. నా ప్రాణాలు పోయినా చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరే వరకు పోరాటం ఆపను’ అని వెయివెయి చెబుతున్నారు.  పోలీసుల దాడిలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో వెయివెయికి జర్మనీలో శస్త్రచికిత్స జరగ్గా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. భూకంపం జరిగి పదేళ్లు పూర్తి కావటంతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆయన్ని ఇంటర్వ్యూ చేయగా ఆయన పలు విషయాలను వెల్లడించారు.

భారీ కుంభ కోణం... కాగా, నాటి భూకంపం దాటికి 6.5 మిలియన్‌ భవనాలు కప్పకూలిపోయాయి. మరో 23 మిలియన్‌ భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా భూకంపం అధికారిక విభాగం, జియాలజిస్టులు నాణ్యత లేని భవనాల మూలంగానే పెను నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఆ తర్వాత కొందరు ఇంజనీర్‌లు భవన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగినట్లు తేలుస్తూ ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. దీంతో భారీ కుంభకోణం చైనా ప్రభుత్వాన్ని కుదిపేసింది. అయితే అవినీతి ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. భారీ భూకంపం జోన్‌లో ఆయా భవనాలు ఉండటంతోనే కుప్పకూలిపోయానని నివేదికను వక్రీకరించింది. కానీ, సామాజిక వేత్త వెయి వెయి పూర్తి ఆధారాలతో ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం స్వతంత్ర్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా ఆ తర్వాత అంశాన్ని పట్టించుకోలేదు. ఈ పరిణామాలతో వెయివెయి పోరాటాన్ని ఉదృతం చేయగా.. ఆయనపై దాడి చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు