ఎన్‌ఎస్జీ ఆశలకు చైనా గండి

25 Jun, 2016 00:53 IST|Sakshi
ఎన్‌ఎస్జీ ఆశలకు చైనా గండి

భారత్‌కు సభ్యత్వంపై తేల్చకుండానే ముగిసిన ప్లీనరీ
- ఎన్పీటీపై సంతకం తప్పనిసరి అన్న చైనా
 
 సియోల్: భారత్ సభ్యత్వంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ఎన్‌ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి) సభ్య దేశాల రెండ్రోజుల ప్లీనరీ శుక్రవారం ముగిసింది. ఎన్పీటీపై(అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం) భారత్ సంతకం చేయనందున... ఆ దేశానికి సభ్యత్వం అంశం పరిగణనలోకి తీసుకోవద్దని సదస్సులో చైనా వాదించింది. బ్రెజిల్, స్విట్జర్లాండ్, టర్కీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లు చైనాకు మద్దతు తెలపడంతో భారత్‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్‌ఎస్‌జీలో  సభ్యత్వం కోసం ముందుగా విధివిధానాలు రూపొందించాలని చైనా కోరింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు గ్రూపులోని చాలా దేశాలు మదతిచ్చినా చైనా అడ్డుపుల్ల వేయడంతో ఆశలు ఆవిరయ్యాయి.

చైనా నిరాయుధీకరణ విభాగం డైరక్టర్ జనరల్ వాంగ్ క్యున్ మాట్లాడుతూ.. భారత్ వంటి నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వంపై కూటమిలో ఏకాభిప్రాయం లేదని, ఎన్‌ఎస్జీలో సభ్యత్వం కావాలంటే ఎన్పీటీపై సంతకం చేయడం తప్పనిసరని అన్నారు. ఈ నియమం చైనా పెట్టింది కాదని, అంతర్జాతీయ సమాజమే పెట్టిందన్నారు.నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వం అంశాన్ని అజెండాలో పెట్టేందుకు ఎన్‌ఎస్జీ అంగీకరించలేదని, అందువల్ల చైనా వ్యతిరేకించడం అన్న ప్రశ్నే లేదని సమర్థించుకున్నారు. గురువారంజరిగిన ప్రత్యేక భేటీలో భారత్ వినతిపై చర్చించినా... చైనాతో పాటు పలు దేశాలు వ్యతిరేకించడంతో భేటీ అసంపూర్తిగా ముగిసింది. భారత్‌కు సహకరించాలంటూ గురువారం ఉదయం తాష్కెంట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు.

కాగా ఎన్పీటీని పూర్తిగా, సమర్ధంగా అమలు చేయాలని ఎన్‌ఎస్జీ రెండ్రోజుల ప్లీనరీలో సభ్య దేశాలు నిర్ణయించాయి. దీంతో భారత్ వంటి దేశాలకు సభ్యత్వంలో మినహాయింపు లేదని తేల్చిచెప్పాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు సభ్యత్వంపై చర్చలు కొనసాగుతాయని ఒక ప్రకటన విడుదల చేశాయి. భారత్‌తో పౌర అణు సహకారం -2008 ప్రకటనపై అన్ని కోణాల్లో చర్చించామని, ఎన్‌ఎస్జీలో నాన్-ఎన్పీటీ దేశాలకు సభ్యత్వంపై సాంకేతిక, న్యాయ, రాజకీయ కోణాల్లో కూడా పరిశీలించామని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఎన్‌ఎస్జీలో సభ్యత్వానికి చైనా అడ్డుపడడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
 భారత్ చేరితే ఎస్‌సీఓ సభ్యదేశాలకు లబ్ధి: మోదీ
 తాష్కెంట్: ఉగ్రవాదం, హింసను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)లో భారత్ సభ్యత్వం ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారమిక్కడ ఎస్‌సీఓ సదస్సులో మాట్లాడుతూ ఇంధనం, సహజ వనరుల విషయంలో సభ్య దేశాల నుంచి భారత్ కూడా లబ్ధి పొందుతుందని చెప్పారు. ఎస్‌సీఓలో భారత్‌కు పూర్తి సభ్యత్వ కోసం సంబంధిత పత్రాలపై సంతకాలు జరిగాయి. భారత్ సభ్యత్వం కోసం సాయపడిన సభ్య దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యత్వం కోసం ఏడాది వ్యవధిలో మరో 30 పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది.  సదస్సు సందర్భంగా రష్యా, అఫ్గానిస్తాన్ తదితర దేశాల నేతలతో మోదీ  భేటీ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీలో పౌర అణు ఇంధనం, పెట్రో రంగంలో సహకారంపై చర్చించారు.

 శాస్త్రి స్ఫూర్తిప్రదాత: మోదీ
 భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి భారతీయులందరికీ స్ఫూర్తిప్రదాత అని మోదీ అన్నారు.  తాష్కెం ట్‌లోని శాస్త్రి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించినట్లు మోదీ ట్విటర్‌లో తెలిపారు.  ఆయన శుక్రవారం సాయంత్రం భారత్‌కు తిరుగు పయనమయ్యారు.

>
మరిన్ని వార్తలు