రొయ్యల్లో వైరస్‌ : దిగుమతులపై చైనా నిషేధం

10 Jul, 2020 20:44 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

బీజింగ్‌ : కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలమైన చైనా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీజ్‌ చేసిన రొయ్యల ప్యాకేజీలో కరోనా వైరస్‌ను గుర్తించిన తరువాత చైనా  ఈక్వెడార్ కు చెందిన మూడు కంపెనీల నుండి ఆహార దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే అధిక ప్రమాదం ఉన్న దేశాల నుండి దిగుమతి చేసుకున్న శీతలీకరించిన ఆహార ఉత్పత్తులను పరీక్షించాలంటూ దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. 

ఇటీవల బీజింగ్‌లో కరోనా విస్తరించడంతో రిఫ్రిజిరేటెడ్ వస్తువులపై తాజా పరిశీలన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ అథారిటీ మూడు ఈక్వడోరియన్ కంపెనీల నుండి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది. డాలియన్,  జియామెన్ నౌకాశ్రయం నుంచి దిగుమతైన వైట్‌లెగ్ రొయ్యల ప్యాకేజింగ్ నుండి తీసిన నమూనాల పరీక్షల్లో పాజిటివ్  తేలిందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారి బీ కెక్సిన్ విలేకరుల సమావేశంలో చెప్పారు. జిన్‌ఫాడి క్లస్టర్‌ను కనుగొన్నప్పటి నుంచి అధికారులు  220,000 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు తెలిపారు. ఇక్కడ దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాకేజీ బోర్డులో వైరస్ కనుగొన్నారు.  అయితే లోపల ప్యాకేజీలోను, రొయ్యల్లోనూ  వైరస్‌ లేదని తేలింది. అయినప్పటికీ మరోసారి ఆహార దిగుమతులపై చైనా నిషేధాన్ని ప్రకటించింది

కాగా గత నెలలో చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో జిన్‌ఫాది హోల్‌సేల్ మార్కెట్‌ ద్వారా కరోనా వైరస్‌ రెండో దశలో విజృంభించిన సంగతి తెలిసిందే. తొలిదశలో అమెరికానుంచి టైసన్‌ పాల ఉత్పత్తులను, జర్మన్‌‌ మాంసం ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. 

మరిన్ని వార్తలు